పవన్‌ కల్యాణ్‌ అనే నేను... జనసైనికులు కోరుకున్న క్షణాాలివే కదా..!

Published : Jun 21, 2024, 01:04 PM IST
పవన్‌ కల్యాణ్‌ అనే నేను... జనసైనికులు కోరుకున్న క్షణాాలివే కదా..!

సారాంశం

పవన్ కల్యాణ్ తొడగొట్టి చేసిన సవాల్ నెగ్గాడు. లక్షలాది మంది జనసైనికుల కల నెరవేర్చాడు. అసెంబ్లీలోకి అడుగుపెట్టి.. పవన్ కల్యాణ్ అనే నేను అంటూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు లక్షలాది మంది జనసైనికుల కల నెరవేరింది. పదేళ్ల సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. నిరాశా నిస్పృహలు, అవమానాలు, అవహేళనలు... ఇవన్నీ దాటి జీరో నుంచి హీరోలా మారింది జనసేన. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పవర్‌ స్టార్‌ అనిపించుకున్నారు పవన్‌ కల్యాణ్‌. తొడకొట్టి సవాల్‌ చేసినట్లే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వైసీపీని మట్టికరిపించి.. సగర్వంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ క్షణాలు జనసేనకు, ఆ పార్టీ శ్రేణులకు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అపూర్వమైనవనడం అతిశయోక్తి కాదు.

పదేళ్ల క్రితం 2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భవించింది. అయితే, ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల కూటమికి మద్దతు ప్రకటించింది. జనసేన శ్రేణులు, పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మద్దతు ఇవ్వగా... టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో టీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజకీయ కారణాలు, పలు అంశాల్లో విభేదాల కారణంగా మద్దతును ఉపసంహరించుకుంది జనసేన. అప్పట్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్‌ ప్రత్యక్షంగా పోరాటాలు చేశారు. 

ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి జనసేన పోటీ చేసింది. ఒక్కరంటే ఒక్కరే జనసేన నుంచి గెలిచారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఇతర అభ్యర్థులెవరూ గెలవలేదు. పవన్ కల్యాణ్‌ అయితే పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోరంగా ఓడిపోయారు. గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు. 

అంతే, జనసేనలో ఒక్కసారిగా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. జనసేన పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అన్న చిరంజీవిలాగే తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ కూడా పార్టీ జెండా పీకేస్తాడని విమర్శించిన వారెందరో. సూటిపోటీ మాటలతో జనసేన కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతిసేందుకు అధికార పక్షం చేయని ప్రయత్నం లేదు. తిట్టని తిట్టులేదు. 

ఇలాంటి సమయంలోనే పవన్‌ కల్యాణ్‌ బలంగా నిలబడ్డారు. జనసైనికుల్లో ధైర్యం నూరిపోశారు. తాను లాంగ్‌ టర్మ్‌ రాజకీయాలు చేయడానికి వచ్చానని... ఒకేసారి ఎదిగిపోవాలన్న ఆశ లేదని చెప్పుకొచ్చారు. కేడర్‌ ఎక్కడా పడిపోకుండా... గుండెల నిండా ధైర్యం నింపారు. ఐదేళ్ల పాటు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న పవన్‌ కల్యాణ్‌.... వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. పక్కా రాజకీయ నాయకుడిగా మారిపోయారు. 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జనసేనపై వైసీపీ చేసిన ప్రతి దాడిని ఎదుర్కొన్నారు. దెబ్బకు దెబ్బ అన్నట్లు, మాటకు మాట అన్నట్లు ప్రతి సమయంలోనూ అధికార పక్షానికి దీటుగా జవాబిచ్చాడు పవన్‌ కల్యాణ్‌. కేడర్‌ను అంతే బలంగా తయారు చేసుకున్నారు. రైతులు, మత్స్యకారులు, సమాజంలో అణగారిన వర్గాల బాధలు, వేదనలను తన కళ్లతో చూశారు. జనసేన తరఫున గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వెన్నుపోటు పొడిచి వైసీపీ పంచన చేరినా.. ఎలాంటి బెణుకు లేకుండా పవన్‌ తన కార్యాచరణ ప్రణాళిక అమలు చేశారు. పేదలు, బాధితుల పక్షాన నిలబడ్డారు. అప్పుల బాధతో ఆత్మ బలిదానాలు చేసుకున్న రైతులకు అండగా నిలబడ్డారు. తాను చెమటోడ్చి సంపాదించిన కోట్లాది రూపాయలను బాధిత కుటుంబాలకు పంచిపెట్టారు. ఐదేళ్లలో ఏ వర్గం బాధలో ఉన్నా తానున్నానంటూ ఆదుకున్నాడు.

అలా, 2024లో బీజేపీని ఒప్పించి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయం చేసిన పవన్‌ కల్యాణ్‌... ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్‌డీయే కూటమిలో ఏపీలో ఘన విజయం సాధించడంలో కింగ్‌ మేకర్‌ అయ్యారు. తనను అవమానించి, అవహేళన చేసిన వైసీపీని అన్నట్లే అథః పాతాళానికి తొక్కారు. జగన్‌ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా చేశారు. కనీవినీ ఎరుగని విధంగా వైసీపీని రాష్ట్రంలో 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేశారు. తనతో జట్టు కట్టిన టీడీపీ, బీజేపీని గెలిపించుకున్న పవన్‌ కల్యాణ్‌.... తన పార్టీ జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. వంద శాతం స్ట్రైక్ రేటు నమోదు చేసి రికార్డు సృష్టించారు. 

 

తొడగొట్టి శపథం చేసినట్లే పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కొణిదెల పవన్‌ కల్యాణ్‌ అనే నేను అంటూ చట్టసభలో ప్రమాణ స్వీకారం చేశారు. శెభాష్‌ పవన్‌ కల్యాణ్‌ అనిపించుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu