తిరుపతి లాగే శ్రీశైలం కూడా ఎదగాలి : మల్లన్న సన్నిధిలో కల్వకుంట్ల కవిత

By Siva KodatiFirst Published Sep 24, 2022, 6:28 PM IST
Highlights

తిరుపతి మాదిరిగా శ్రీశైలం కూడా ఎదగాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శనివారం కవిత దంపతులు మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు అందరూ బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని ఈ రోజు ఎమ్మెల్సీ కవిత , అనిల్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానంలో నిరంతరం ఎక్కడో ఒక చోట తెలంగాణ నుండి ప్రతి ఒక్కరూ పాల్గొంటుంటారని అన్నారు. శ్రీశైలం సన్నిధికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్ని సార్లు వచ్చినా మల్లికార్జున స్వామిని, భ్రమరాంబ అమ్మవారిని చూస్తే తనివి తీరదన్నారు. గతంలో కన్నా ఇప్పుడే శ్రీశైలంలో అభివృద్ధి కనిపిస్తోందన్న ఎమ్మెల్సీ కవిత, తిరుపతి మాదిరిగా శ్రీశైలం కూడా ఎదగాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. 

 

 

అంతకుముందు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత కు కల్వకుర్తి వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు.

 

 

బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో రేపటి నుండి జరగనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్ లను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూకే, ఖతర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కువైట్, దుబయ్, స్విట్జర్లాండ్, ముంబయి లలో జరిగే బతుకమ్మ వేడుకల పోస్టర్ లను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. దీంతోపాటు తెలంగాణ జాగృతి ఖతర్, తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ ఆధ్వర్యంలో రూపొందిన బతుకమ్మ ప్రొమోలను  ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి వివిధ దేశాల శాఖల ప్రతినిధులు, జాగృతి రాష్ట్ర నాయకులు  పాల్గొన్నారు.

 


 

click me!