దావోస్ లో ఉన్నా చంద్రబాబుకు టెన్షనేనా ?

First Published Jan 25, 2018, 12:13 PM IST
Highlights
  • దిశానిర్దేశం లేకపోవటంతో నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది.

చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. దాంతో దావోస్ లో కూడా చంద్రబాబుకు మనశ్శాంతి లేకుండాపోతోంది. అందులోనూ బుధవారం వరుసగా జరిగిన రెండు సంఘటనలు టిడిపి నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొదటిదేమో బాలకృష్ణ నుండి ఎదురవ్వగా రెండో ఘటనేమో భాజపా నుండి ఎదురైంది. రెండు వరుస ఘటనలు కూడా చంద్రబాబు అయినా టిడిపి నేతలైనా ఏమాత్రం ఊహించనివే. దాంతో సరైనా దిశానిర్దేశం లేకపోవటంతో నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది.

బావమరది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ సిఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సిఎం లేనపుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరూ సమీక్షలు నిర్వహించేందుకు లేదు. కానీ వచ్చింది హిందుపురం ఎంఎల్ఏనే కాకుండా బావమరిది, వియ్యంకుడు కూడా కావటంతో సెక్యురిటీ నోరిప్పలేదు. దాంతో సమీక్ష నిరాఘాటంగా జరిగిపోయింది. సరే, విషయం వెలుగు చూడటంతో సర్దుబాటు చేయటానికి నానా అవస్తులు పడుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో బాలకృష్ణ కూర్చోవటాన్ని టిడిపి నేతలెవరూ జీర్ణించుకోలేకున్నారు.

ఇక రెండోది భాజపా సంగతి. ఫిరాయింపు మంత్రులు, ఎంఎల్ఏలపై చంద్రబాబు వెంటనే వేటు వేయాలని భాజపా శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేయటం. ఈ డిమాండ్ ను టిడిపి ఏమాత్రం ఊహించలేదు. మిత్రపక్షం అయ్యుండీ ప్రతిపక్ష వైసిపి డిమాండ్ తో గొంతు కలపటంతో టిడిపికి మింగుడుపడటం లేదు.

దావోస్ లో ఉన్న చంద్రబాబుకు విషయం తెలియగానే ఆశ్చర్యపోయారట. మిత్రపక్షం, ప్రతిపక్షంతో కలవటమేంటనేది చంద్రబాబుకు కూడా అంతుబట్టటం లేదు. కొద్ది రోజులుగా భాజపా-టిడిపి మధ్య సంబంధాలు క్షీణించాయన్నది వాస్తవం. వచ్చే ఎన్నికల్లో పొత్తు కంటన్యూ చేయటాన్న ఇరుపార్టీల నేతలు ఇష్టపడటం లేదు. అయితే పొత్తు కొనసాగించటం చంద్రబాబుకు మాత్రం తప్పని పరిస్ధితి. ‘ఓటుకునోటు’ లాంటి కేసుల్లో విచారణ జరగకుండా ఉండాలంటే భాజపాతో పొత్తు తప్పదు. అందుకే ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా, కేంద్రం ఏ విషయంలోనూ సహకరించకున్నా భరిస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్ పరిణామాలు దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబులో ఆందోళన పెంచేది మాత్రం ఖాయం.

 

 

click me!