
వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పంపిన ‘పొత్తు సిగ్నల్’ భాజపాను బలంగానే తాకినట్లుంది. ప్రత్యేకహోదా హామీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తుకు సిద్ధమని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పొత్తులపై జగన్ ప్రకటించిన 48 గంటల్లోనే భాజపా నుండి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. అసెంబ్లీలో భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు చేసిన డిమాండ్ తో జగన్ పంపిన సిగ్నల్ అత పవర్ ఫుల్లా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
ఫిరాయింపులపై ఇంతకాలం వైసిపి చేస్తున్న డిమాండ్ నే తాజాగా విష్ణు కూడా చేయటంతో టిడిపికి మింగుడుపడటం లేదు. ఫిరాయింపులను అందులోనూ మంత్రులపై తక్షణమే వేటు వేయాలంటూ విష్ణు చేసిన డిమాండ్ తో టిడిపి నేతలు ఉలిక్కిపడ్డారు. ఫిరాయింపుల విషయంలో వైసిపి చేస్తున్న డిమాండ్ నే మిత్రపక్షం భాజపా కూడా మొదలుపెట్టటంతో టిడిపికి షాక్ కొట్టినట్లైంది.
ఇంతకీ ఇంత సడెన్ గా భాజపా ఫిరాయింపులపై ఎందుకు డిమాండ్ మొదలు పెట్టింది? అంటే, అందుకు పెద్ద కథే ఉందట. ఇంతకీ ఆ కథేమిటంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల చేస్తున్న పర్యటనలన్నీ చంద్రబాబునాయుడుకు మద్దతుగానే సాగుతున్నాయి. పవన్ ఎక్కడ పర్యటించినా జనాలేమో చంద్రబాబును విమర్శిస్తున్నారు. అయితే, పవన్ ఆ విమర్శలను పట్టించుకోకుండా ఆ సమస్యలన్నింటికీ కారణం జగనే అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
అంటే ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. అదేమిటంటే, చంద్రబాబుకు మద్దతుగానే పవన్ రంగంలోకి దిగారన్న విషయం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ మద్దతుగా నిలబడతారనే అనుమానాలు అందరిలోనూ బలంగా నాటుకుపోయాయి. అదే సమయంలో భాజపాతో చంద్రబాబు సంబంధాలు క్షీణిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ మధ్య ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొత్తులుంటాయని అందరికి అర్ధమైపోయింది.
ఈ నేపధ్యంలోనే భాజపా కూడా ముందుజాగ్రత్త పడుతున్నట్లు కనబడుతోంది. చంద్రబాబు ఆలోచనలు గ్రహించే వైసిపి వైపు జరుగుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒంటరిగా పోటీ చేసేంత సీన్ భాజపాకు లేదన్న విషయం అందరకీ తెలిసిందే. చంద్రబాబుతో పొత్తుకు భాజపాలోని కొందరు నేతలు బలంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి పెట్టుకునే పొత్తేదో వైసిపితోనే పెట్టుకుంటే బాగుంటుందన్నది భాజపా ఆలోచనగా తెలుస్తోంది. చూడబోతే భవిష్యత్ పొత్తులకు విష్ణు డిమాండ్ సంకేతాలా అన్న అనుమానాలు మొదలయ్యాయి అందరిలోనూ.