దేశంలోనే నెంబర్ వన్ గా గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్... 5 జాతీయ అవార్డులు: మంత్రి శ్రీవాణి

By Arun Kumar PFirst Published Aug 5, 2021, 4:58 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) వివిధ విభాగాల్లో అత్యుత్తమంగా నిలిచి 5 జాతీయ అవార్డులను సాధించిందని మంత్రి పుష్ప శ్రీవాణి వెల్లడించారు.

అమరావతి: వన్ ధన్ యోజన, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను కల్పించడంలోనూ, సేంద్రీయ,సహజ ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ లోనూ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) జాతీయ స్థాయిలో దేశంలోనే మొదటి ర్యాంకులను సాధించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఈ విభాగాలతో పాటుగా జీసీసీ 5 జాతీయ అవార్డులను సాధించిందని వెల్లడించారు. జీసీసీ వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు ట్రైఫెడ్ ఈ అవార్డులను ఇవ్వనుందని తెలిపారు. 

వన్ ధన్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలోనూ, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను ఇప్పించడంలోనూ ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు మొదటి ర్యాంకును కేటాయించిందని చెప్పారు. సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తులను సరఫరా చేయడంలోనూ ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు కూడా మొదటి ర్యాంకును ఇచ్చారని పుష్ప శ్రీవాణి వివరించారు. దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4.50 కోట్ల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు జీసీసీకి దక్కిందని తెలిపారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.9.76 కోట్ల విలువైన చిన్న తరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 3వ ర్యాంకును జీసీసీ సాధించిందని విపులీకరించారు. 2020-21లో అత్యధికంగా రూ. 12.86 కోట్ల నిధులను వినియోగించుకున్నందుకు మరో జాతీయ అవార్డు కూడా జీసీసీకి రానుందని చెప్పారు. ఈ విధంగా ఉత్తమ పనితీరుతో జీసీసీకి జాతీయస్థాయిలో మొత్తం 5 అవార్డులు లభించాయని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. 

read more 20ఏళ్ల సమస్య... కానీ సీఎం జగన్ ఒక్క నిర్ణయంతో పరిష్కారం...: మంత్రి పెద్దిరెడ్డి

కరోనా కష్టకాలంలోనూ జీసీసీ అధికార, సిబ్బంది అంకితభావంతో ఎక్కువ వ్యాపార వ్యవహారాలను నిర్వహించగలిగారని ప్రశంసించారు. 2019-20 సంవత్సరంలో అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు రూ.13.18 కోట్లను వెచ్చించగా, 2020-21 సంవత్సరంలో రూ.76.37 కోట్లతో వీటిని సేకరించామని తెలిపారు. జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు కూడా 2019-20లో రూ.24.22 కోట్ల మేరకు జరగగా 2020-21లో ఈ అమ్మకాలు రూ.33.07 కోట్లకు పెరిగాయని వివరించారు. 2019-20 సంవత్సరం మొత్తం మీద జీసీసీ తన కార్యక్రమాల ద్వారా రూ.368.08 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేయగలిగిందని చెప్పారు. 

ఆ తర్వాత వచ్చిన 2020-21 సంవత్సరం ప్రారంభం నుంచి కూడా కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉండి వ్యాపార కార్యకలాపాలకు విఘాతం వాటిల్లినా, గిరిజన ఉత్పత్తుల సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న చర్యల ఫలితంగా 2020-21లో జీసీసీ రూ. 450.68 కోట్ల మేరకు వ్యాపారాన్ని చేయగలిగిందని వివరించారు. తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి తీసుకున్న చర్యలు, పటిష్టమైన పర్యవేక్షణ కారణంగానే ఇది సాధ్యమైయిందని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగానే జీసీసీ అధికార సిబ్బందికి పుష్ప శ్రీవాణి అభినందనలు తెలిపారు. 

 

click me!