ట్రావెల్ ఏజెన్సీ మోసం.. హోటల్‌లో నిర్బంధం, జమ్మూ కశ్మీర్‌లో సిక్కోలు వాసుల ఇక్కట్లు

By Siva KodatiFirst Published Nov 24, 2021, 4:09 PM IST
Highlights

సింధు నది పుష్కరాలకు (sindhu nadi pushkaralu 2021) వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు (srikakulma) జమ్మూకాశ్మీర్‌లో (jammu and kashmir) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాత్రికులను తీసుకువెళ్లిన అకుల్ ట్రావెల్ ఏజెన్సీ (akul travel agency)  ప్రతినిధులు.. వారిని హోటల్లో వదిలేసి జారుకున్నారు.

సింధు నది పుష్కరాలకు (sindhu nadi pushkaralu 2021) వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు (srikakulma) జమ్మూకాశ్మీర్‌లో (jammu and kashmir) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాత్రికులను తీసుకువెళ్లిన అకుల్ ట్రావెల్ ఏజెన్సీ (akul travel agency)  ప్రతినిధులు.. వారిని హోటల్లో వదిలేసి జారుకున్నారు. దీంతో హోటల్ బిల్లు కట్టాలని 120 మందిని హోటల్ సిబ్బంది నిర్బంధించారు. ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధుల మోసంతో షాక్‌కు గురైన యాత్రికులు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేటకు చెందిన 120 మంది యాత్రికులు.. మైసూరుకు చెందిన అకుల్ ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు ద్వారా జమ్మూ కశ్మీర్‌లో సింధు పుష్కరాలకు వెళ్లారు. వీరి నుంచి కపూల్ టూరిజం పేరుతో ఒక్కో జంట నుంచి రూ.60 వేలు వసూలు చేశారు. వీరికి కట్రా కాంటినెంటల్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు.

అయితే మూడు రోజులపాటు వారితో పాటే ఉన్న ట్రావెల్స్ ప్రతినిధులు.. నాలుగో రోజు సెల్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు. దీంతో హోటల్ ఖాళీ చేయాలనుకున్న యాత్రికులను డబ్బులు కట్టాలని హోటల్ యాజమాన్యం నిర్బంధించింది. ఒక్కొక్కరూ రూ.10 వేలు చెల్లించి హోటల్ ఖాళీ చేయాలని చెప్పింది. దీంతో యాత్రికులు షాక్‌కు గురయ్యారు. తమకేమి తెలియదని.. అంతా ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్లకు డబ్బులు కట్టామని చెప్పారు. వారు  తమకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని.. మీరు కట్టాల్సిందేనని హోటల్ నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. తమ దగ్గర ఎలాంటి ప్రూఫ్‌లు తీసుకోకుండా హోటల్ వాళ్లు రూములు ఇచ్చారని.. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. తమ ఫోన్లు పనిచేయకుండా హోటల్ యాజమాన్యం జామర్లు పెట్టిందని వారు అంటున్నారు.
 

click me!