
అమరావతి : జనసేన రాష్ట్ర కార్యాలయంలో నేడు జనసేన వీరమహిళలకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జనసేన పీఎసీ సభ్యులు నాగబాబు, వీర మహిళలు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. గుంటూరు, కృష్ణాజిల్లాలలో వీర మహిళలకు నేడు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సాయంత్రం ఐదు గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.
ఈ సమావేశంలో జనసేన పీఎసీ సభ్యులు నాగబాబు మాట్లాడుతూ.. వీర మహిళలు రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలి.. మీడియా సమావేశాల్లో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో మహిళలకు నిపుణులు వివరిస్తారని తెలిసారు.
వీర మహిళలు సామాజిక స్పృహతో, ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం అని ప్రశంసించారు. మామూలుగా మగవాళ్లకు సహజంగానే ఇగో ఉంటుంది. దాన్ని దాటుకుని నేడు అన్ని రంగాల్లో మహిళల పాత్ర కీలకంగా మారిందన్నారు. ఆడవాళ్లకు అవకాశం అందిస్తే.. మగవాళ్లకంటే వంద రెట్లు స్పీడ్ తో దూసుకెళతారన్నారు.
టీడీపీలో చేరిన ఇండస్ట్రియలిస్ట్ గంటా నరహరి.. రాజంపేట నుంచి లోక్ సభ బరిలో..?
తమకంటే వేగంగా ఎక్కడ దూసుకెడతారోననే భయంతోనే చాలా మంది అవకాశాలు ఇవ్వరని అన్నారు. అమరావతి ఉద్యమంలో అతివల పాత్ర అందరూ చూశారన్నారు. చేసిన త్యాగాలు వృధా పోకుండా భవిష్యత్ తరాల కోసం చేసిన పోరాటం ఎందరికో స్పూర్తిదాయకం అన్నారు. మహిళా శక్తి ఏమిటో ఇళ్ళల్లో అందరికీ తెలుసు అని.. అయినా అంగీకరించరన్నారు.
ఇంటిని చక్కబెట్టే ఇల్లాలు... సమాజాన్ని కూడా చక్కని దారిలో పెట్టగలదన్నారు. మన భాష సరిగా ఉంటూ, సరైన దారిలో ప్రశ్నిస్తే.. ఎవరైనా భయపడాల్సిందేనన్నారు. అందుకే మహిళలంతా.. అంశాల వారీగా అవగాహన పెంచుకుని సమస్యలపై నిలదీయాలి తెలిపారు.
ఆడపిల్లలు ఎటువంటి డ్రెస్ వేసుకోవాలో నిర్ణయించే అధికారం ఏ మగవాడికీ లేదన్నారు. ఆడవాళ్లను నకశిక పర్యంతం చూసి లోపాలను వెతకడం అంటే.. ఆ వ్యక్తి ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలన్నారు. మంచి పని చేస్తున్నప్పుడు వెనక్కి లాగేవాళ్లు అన్ని చోట్లా ఉంటారని.. మనం మంచి ఉద్దేశంతో అడుగు ముందుకు వేస్తూ లక్ష్యాలను సాకారం చేసుకోవాలని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన అతివలందరికీ అభినందనలు తెలిపారు.