
ఆంధ్ర ప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లిన యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. సరదాగా గోదావరిలో ఈతకు దిగగా నీటిప్రవాహం ఎక్కువగా ఉండటంతో యువకులు కొట్టుకుపోయారు. ఇలా 8 మంది నదిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే... బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం శేరులంకకు చెందిన పొలిశెట్టి అభిషేక్ నిన్న(సోమవారం) తన ఇంట్లో శుభకార్యానికి స్నేహితులను ఆహ్వానించాడు. దీంతో కాకినాడ, రామచంద్రాపురం, మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు వచ్చారు. వీరంతా మధ్యాహ్నం బోజనాల తర్వాత సరదాగా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్దగల గోదావరి తీరానికి వెళ్లారు.
అయితే నదిలో నీటిని చూడగానే కొందరు యువకులు ఈత కొడదామని సరదాపడ్డారు... కానీ నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని గుర్తించలేకపోయారు. మొదట ఇద్దరు యువకులు నదిలో దూకి కొట్టుకుపోతుండగా మిగతావారు కాపాడే ప్రయత్నంచేసారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మొత్తం 11 మంది నదిలోకి దిగారు. వీరిలో ఓ ముగ్గురు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేరగా మిగతా 8 మంది గల్లంతయ్యారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డివోతో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాణాలతో బయటపడ్డ యువకులను అడిగి వివరాలు సేకరించారు. వెంటనే గజ ఈతగాళ్లు, ఎస్డిఆర్ఎఫ్ బలగాలతో యువకుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో సహాయకచర్యలకు ఆటంకం కలిగింది... మంగళవారం ఉదయం తిరిగి గాలింపు చేపట్టారు.
గల్లంతయిన యువకుల్లో ఒకే కుటుంబానికి చెందిన సోదరులు కూడా ఉన్నారు. సబ్బిత క్రాంతి కిరణ్ (19), సబ్బిత పాల్ అబిషేక్ (18)...వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (15) ఒకే కుటుంబానికి చెందినవారు. వీరితో పాటు తాటిపూడి నితీష్ (18), ఏలుమర్తి సాయి (18), రోహిత్ (18), ఎలిపె మహేష్ (14) గల్లంతయినవారిలో ఉన్నారు.
ఈ దుర్ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తంచేసి బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు పవన్ కల్యాణ్.