తిరుమలలో బాలుడి కిడ్నాప్.. పెంచుకోవడానికి ఎత్తుకెళ్లాడు: అర్భన్ ఎస్పీ

By sivanagaprasad kodatiFirst Published Jan 1, 2019, 11:36 AM IST
Highlights

తిరుమలలో కిడ్నాపైన బాలుడు వీరేశ్‌ కథ సుఖాంతమైంది. 48 గంట్లోనే కేసును చేధించిన పోలీసులు మహారాష్ట్రలో నిందితుడు విశ్వంభర్‌ను అదుపులోకి తీసుకుని చిన్నారిని రక్షించారు. ఈ క్రమంలో కేసు వివరాలను తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పీ మీడియాకు వివరించారు.

తిరుమలలో కిడ్నాపైన బాలుడు వీరేశ్‌ కథ సుఖాంతమైంది. 48 గంట్లోనే కేసును చేధించిన పోలీసులు మహారాష్ట్రలో నిందితుడు విశ్వంభర్‌ను అదుపులోకి తీసుకుని చిన్నారిని రక్షించారు. ఈ క్రమంలో కేసు వివరాలను తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పీ మీడియాకు వివరించారు.

మహారాష్ట్రలోని లాతూరుకు చెందిన ప్రశాంత్ జీ యాదవ్, స్నేహ దంపతులు తిరుమల దర్శనానికి వచ్చారని తెలిపారు. 28వ తేది ఉదయం వాళ్ల బాబు వీరేశ్‌ తప్పిపోయినట్లు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్పీ తెలిపారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఒక వ్యక్తి చిన్నారిని ఎత్తుకుపోవడం గమనించామన్నారు. 30 సీసీకెమెరాల్లో రికార్డైన ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని గీయించి అదే రోజు సాయంత్రం సోషల్ మీడియాలో పెట్టామన్నారు. 29వ తేదీ ఉదయం మీడియా ద్వారా నిందితుడి ఊహాచిత్రాన్ని దేశవ్యాప్తంగా చూపించామన్నారు.

ఈ క్రమంలో మహారాష్ట్రలో నిందితుడి పోలీకలతో ఉన్న వ్యక్తి సంచరిస్తున్నాడని, 30వ తేదీ తమకు చిత్తూరు పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన తాము ఆరు బృందాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేశామని, ఒక బృందాన్ని మహారాష్ట్రకు పంపామని ఎస్పీ వెల్లడించారు.

నిందితుడు ఒక క్వారీలో పనిచేస్తున్నాడని తెలిసిందని వెంటనే చిత్తూరు, నెల్లూరు జిల్లాలో గాలించామన్నారు. ఈ క్రమంలో మహూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబు ఆచూకీ తెలిసిందని ఆయన తెలిపారు. కేవలం 48 గంటల్లోనే కేసును చేధించామని, ఇందుకు సహకరించిన మీడియా, టీటీడీ విజిలెన్స్, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, గుంతకల్‌ రైల్వే  పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

నిందితుడి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన విశ్వంభరగా తెలిసిందని, ఇతని వయసు 44 సంవత్సరాలని, మేస్త్రి పని చేస్తున్నాడని ఎస్పీ తెలిపారు. నిందితుడికి పెళ్లికాకపోవడం వల్ల బాబుని పెంచుకోవాలని కిడ్నాప్‌కు పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. ఇకపై తిరుమలలో చిన్నారుల కిడ్నాప్‌లను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రకటించారు. 

click me!