తిరుపతి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 26, 2024, 6:06 PM IST
Highlights

తమిళనాడుకు అత్యంత చేరువలో వుంటూ రాయలసీమ పరిధిలోకి వచ్చే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌పై అన్ని పార్టీల ప్రభావం వుంటుంది. టాలీవుడ్ సూపర్‌స్టార్లు నందమూరి తారక రామారావు, చిరంజీవిలను చట్టసభల్లోకి పంపింది. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ.. అనూహ్యంగా ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి రేసులో నిలిచారు. తిరుపతి టికెట్ కోసం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో పెద్ద పోటీ నెలకొంది. అయితే చివరికి జనసేన నేత ఆరణి శ్రీనివాసులుకు టికెట్ ఖరారైంది.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైయున్న తిరుపతి ఆధ్యాత్మికతకు , ప్రశాంత వాతావరణానికి నిలయం. నిత్యం దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ఆధ్యాత్మక శోభతో పాటు రాజకీయంగానూ ఎప్పుడూ వార్తల్లో వుంటుంది తిరుపతి. తమిళనాడుకు అత్యంత చేరువలో వుంటూ రాయలసీమ పరిధిలోకి వచ్చే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌పై అన్ని పార్టీల ప్రభావం వుంటుంది. ఎందరో ఉద్ధండులైన రాజకీయ నాయకులు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. 

తిరుపతి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. ఎన్టీఆర్, చిరులను చట్టసభలకు పంపిన గడ్డ :

టాలీవుడ్ సూపర్‌స్టార్లు నందమూరి తారక రామారావు, చిరంజీవిలను చట్టసభల్లోకి పంపింది. ఈ ఇద్దరు అగ్రహీరోలు తమ పొలిటికల్ ఎంట్రీ కోసం తిరుపతిని కేంద్రంగా ఎంచుకోవడం విశేషం. టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల ఆవిర్భావ సభలు తిరుపతిలోనే జరిగి సంచలనం సృష్టించాయి. 1952లో ఏర్పడిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్ మండలాలు వున్నాయి. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా తిరుపతి కార్పోరేషన్‌తో పూర్తిగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. రెడ్డి, కమ్మ, శెట్టి బలిజ ఓటర్లు ఇక్కడ బలంగా వున్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసిన అగరాల ఈశ్వర్ రెడ్డి కొద్దికాలం అసెంబ్లీ స్పీకర్‌గానూ సేవలందించారు. 

తిరుపతిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2019 నాటికి 2,70,762 మంది. అన్ని పార్టీలను ఇక్కడి ప్రజలు సమానంగా ఆదరించారు. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డికి 80,544 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి సుగుణమ్మకు 79,836 ఓట్లు పోలయ్యాయి. అయితే వీరిద్దరి మధ్య ఓట్ల తేడా తక్కువగా వుండటంతో ఫలితాల రోజున ఉత్కంఠ నెలకొంది. చివరికి భూమన 708 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

తిరుపతి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. కొడుకును బరిలో దించిన భూమన :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. తిరుపతిపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో వున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ.. అనూహ్యంగా ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి రేసులో నిలిచారు. జగన్ సంక్షేమ పాలన, తిరుపతిలో తమ కుటుంబానికి వున్న పేరు తనను గెలిపిస్తాయని అభినయ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుపతి టికెట్ కోసం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో పెద్ద పోటీ నెలకొంది. అయితే చివరికి జనసేన నేత ఆరణి శ్రీనివాసులుకు టికెట్ ఖరారైంది. జగన్ పాలనపై వ్యతిరేకత, కూటమి బలంగా వుండటంతో తన విజయం ఖాయమని శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

click me!