చంద్రగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 26, 2024, 5:09 PM IST
Highlights

హేమాహేమీలను దేశానికి అందించిన ఘనత చంద్రగిరిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం సీఎంగా, ప్రతిపక్షనేతగా సేవలందించిన చంద్రబాబు నాయుడు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోనే వుంది. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో ప్రత్యేకత చాటుకున్న గల్లా కుటుంబం కూడా చంద్రగిరి నుంచే కార్యకలాపాలు సాగించింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. 2014, 2019లలో ఆయన వరుస విజయాలు సాధించారు. చెవిరెడ్డికి బదులు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి జగన్ టికెట్ కేటాయించారు. చెవిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ అభ్యర్ధిగా పులివర్తి నానికి టికెట్ కేటాయించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం.. ఓ వైపు ఆధ్యాత్మికతకు, మరోవైపు వ్యవసాయానికి , మరో రంగంలో రాచరిక పాలనకు పెట్టింది పేరు. విజయనగర రాజులు చంద్రగిరి కేంద్రంగా పాలన నిర్వహించి రత్నాలను రాశులుగా పోసిన అమ్మిన చరిత్ర ఈ గడ్డం సొంతం. విస్తారంగా విస్తరించి వున్న శేషాచలం అడవులు , తలకోన జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. రాజకీయాల విషయానికి వస్తే.. హేమాహేమీలను దేశానికి అందించిన ఘనత చంద్రగిరిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం సీఎంగా, ప్రతిపక్షనేతగా సేవలందించిన చంద్రబాబు నాయుడు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోనే వుంది. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో ప్రత్యేకత చాటుకున్న గల్లా కుటుంబం కూడా చంద్రగిరి నుంచే కార్యకలాపాలు సాగించింది. 

చంద్రగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. హేమాహేమీలకు అడ్డా :

1952లో ఏర్పడిన చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టిగలు, యర్రావారిపల్లె, కొంకచెన్నయ్యగుంట మండలాలున్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో పుత్తూరు నియోజకవర్గం నుంచి రామచంద్రాపురం మండలం, పీలేరు సెగ్మెంట్‌లోని యర్రావారిపాళ్యం, చిన్నగొట్టిగలు, తిరుపతి రూరల్ మండలాలు చంద్రగిరి నియోజకవర్గం కిందకు వచ్చాయి. ఈ సెగ్మెంట్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,91,734. గల్లా అరుణ కుమారి ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ పనిచేశారు. 

ఆమె తండ్రి పాతూరి రాజగోపాల నాయుడు రెండు సార్లు తవనంపల్లె నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సినీ నటి రోజా సైతం టీడీపీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలా చంద్రగిరి రాష్ట్రంలో వీఐపీ సీటుగా మారింది. తిరుపతి , తిరుమలకు తాగునీటిని అందించే తెలుగు గంగ, కళ్యాణిడ్యామ్‌ వంటి ప్రాజెక్ట్‌లు చంద్రగిరి నియోజకవర్గంలోనే వున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో ఎక్కువ మంది కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. 

చంద్రగిరి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. చెవిరెడ్డికి చెక్ పెట్టగలరా : 

ప్రస్తుతం వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. 2014, 2019లలో ఆయన వరుస విజయాలు సాధించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 1,27,790 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)కి 86,035 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 41,755 ఓట్ల మెజారిటీతో చంద్రగిరిలో విజయం సాధించింది.

2024 ఎన్నికల విషయానికి వస్తే.. చెవిరెడ్డి కుటుంబం మంచి జోరులో వుంది. ప్రజలకు అందుబాటులో వుండటం, పలు అభివృద్ధి కార్యక్రమాలతో భాస్కర్ రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి కూడా ఆయనే బరిలో దిగుతారని అంతా అనుకున్నారు. కానీ చెవిరెడ్డికి బదులు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి జగన్ టికెట్ కేటాయించారు. తండ్రి అడుగుజాడల్లో నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు మోహిత్. 

టీడీపీ విషయానికి వస్తే.. చెవిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ గెలిచి దాదాపు 30 ఏళ్లు కావొస్తోంది. చివరిసారిగా 1994లో టీడీపీ ఇక్కడ విజయం సాధించింది. నాటి నుంచి నేటి వరకు చంద్రగిరి ప్రజలు టీడీపీని తిరస్కరిస్తూనే వున్నారు. అయితే ఈసారి మాత్రం పసుపు జెండా ఎగురవేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీ అభ్యర్ధిగా పులివర్తి నానికి టికెట్ కేటాయించారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయిన సానుభూతితో పాటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా తాను విజయం సాధిస్తానని నాని ధీమా వ్యక్తం చేశారు. 

click me!