టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదం... ప్రొద్దుటూరులో ఉద్రిక్తత, సోము వీర్రాజు అరెస్ట్

By Arun Kumar PFirst Published Jul 27, 2021, 11:56 AM IST
Highlights

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బిజెపి శ్రేణులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

కడప: టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ ఆంధ్ర ప్రదేశ్ బిజెపి కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆందోళనకు దిగింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సారథ్యంలో బీజెపి శ్రేణులు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. 

అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్న ప్రాంతానికి సోము వీర్రాజు బయలుదేరారు. అయన వెంటే బిజెపి నేతలు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముందంటూ ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకుని సోము వీర్రాజును అరెస్ట్ చేశారు. 

video  టిప్పు సుల్తాన్ విగ్రహం వివాదం...సోము వీర్రాజు ఎంట్రీతో ప్రొద్దుటూరులో టెన్షన్ టెన్షన్ 

వీర్రాజు అరెస్ట్ సమయంలో పోలీసులకు, బిజెపి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు నాయకులు నాగోతు రమేష్ నాయుడు, భానుప్రకాష్ రెడ్డి , విష్ణు వర్ధన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సోము వీర్రాజు మాట్లాడుతూ... ఏపీలో హిందూ మతానికి వ్యతిరేకంగా పరిపాలన సాగుతోందన్నారు. అందులో భాగంగానే టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వెంటనే ఇలాంటి చర్యలను మానుకోవాలని... ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టిప్పు విగ్రహం ఏర్పాటు తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుచేసినా ధ్వంసం చేస్తామని వీర్రాజు హెచ్చరించారు.
 

click me!