ఏపీలో పెట్రోల్ కూడా పోయట్లేదు.. కౌంటింగ్ రోజు ఎక్స్ట్రాలు చేస్తే ఇక అంతే!

By Galam Venkata Rao  |  First Published Jun 3, 2024, 8:52 AM IST

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పర్వానికి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా నిఘా పరిధిలోకి వచ్చేసింది. కౌంటింగ్ వేళ అవాంచనీయ ఘటనలు జరగ్గకుండా డేగ కళ్లతో నిఘా పెట్టారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పోలీసు యంత్రాంగం... ఎక్స్ట్రాలు చేసే వారిని మడత పెట్టేందుకూ వెనకాడటం లేదు. సోషల్ మీడియా పోస్టింగులపైనా నజర్ పెట్టారు...  


ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ తెరపడే సమయం ఆసన్నమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. కౌంటింగ్‌ కేంద్రాల లోపల, వెలుపల పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే వరకు సంయమనం పాటించాలని అభ్యర్థులు, శ్రేణులకు ఆయా రాజకీయ పార్టీల అధినాయకత్వాలు స్పష్టంచేశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌, ఫలితాల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పక్కా ఏర్పాట్లు చేశారు. రూల్స్‌ పాటించకుండా గొడవలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా జిల్లాలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలందాయి. రేపు సాయంత్రంలోగా ఫలితాలపై క్లారిటీ రానున్నప్పటికీ... రేపు, ఎల్లుండి అంటే 4, 5 తేదీల్లో విజయోత్సవాలు, ర్యాలీలు, సంబరాలపై పోలీసు శాఖ నిషేధం విధించింది. ఎన్నికల కౌంటింగ్‌ ముగిసిన మరుసటి రోజు కూడా సంబరాలు చేసుకునేందుకు అనుమతి లేదు. 

Latest Videos

undefined

అభ్యర్థులకు స్పెషల్‌ సెక్యూరిటీ...
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఘర్షణలు, అల్లర్లు జరిగే అవకాశముందన్న కేంద్ర నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలైన అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థులకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి అభ్యర్థి వెన్నంటే ఉంటూ సెక్యూరిటీ ఇస్తున్నాయి. అలాగే, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, వాటి పరిసరాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో భారీగా డ్రోన్లతో నిఘా పెట్టారు. ఇక కౌంటింగ్‌ కేంద్రాలకు 5 కిలోమీటర్ల మేర పోలీసు బలగాలు అధీనంలోకి తీసుకొని పూర్తి నిఘా పెట్టేశారు.

ఐదంచెల భద్రత...
ఇకపోతే, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఇప్పటికే మూడంచెల భద్రత ఉంది. దానికి అదనంగా మరో రెండంచెల భద్రతను పెంచేశారు. ఎక్కడికక్కడ కౌంటింగ్‌ కేంద్రాలకు దూరంగా ట్రాఫిక్‌ మళ్లించారు. జాతీయ, ప్రధాన రహదారుల వెంట ఉండే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ఎక్కువ మంది చొచ్చుకొని రాకుండా బారికేడ్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంది. సెల్‌ఫోన్లు, ఇతర స్మార్ట్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదు. నాయకులు అనుచరులమంటూ జులుం చూపిస్తే పోలీస్‌ స్టైల్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అనుమతి లేని వ్యక్తులు, రౌడీ షీటర్లు, ఇతర అసాంఘిక శక్తులు కేంద్రాల్లోకి ప్రవేశిస్తే గుర్తిచేందుకు సీసీ కెమెరాలు, ఫేషియల్‌ రికగ్నిషన్‌ కెమెరాలను అమర్చారు. 

 గొడవ చేస్తే రౌడీషీట్‌...
లెక్కింపు రోజు, ఆ తర్వాత గెలిచిన అభ్యర్థుల విజయోత్సవాలు, సభలకు అనుమతి లేదు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై రౌడీ షీట్లు తెరిచేందుకూ పోలీసులు వెనుకాడటం లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్‌ 144, సెక్షన్‌ 30, పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్నాయి. పోలింగ్‌ రోజు(మే 13న), ఆ మరుసటి రోజు అనంతపురం జిల్లా పుట్టపర్తి, తిరుపతి జిల్లా చంద్రగిరి, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో వందల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనేక మంది బైండోవర్‌ చేసి జిల్లాల నుంచి బహిష్కరించారు. పల్నాడు జిల్లా హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇప్పటికే పెట్రోల్‌ బంకుల్లో నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. వాహనాల్లో తప్ప క్యాన్లు, బాటిళ్లలో పెట్రోల్‌ నింపడం లేదు. 

సోషల్‌ మీడియాపై డేగ కన్ను
కౌంటింగ్‌ నేపథ్యంలో రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెడితే ఇక అంతే సంగతులు. ప్రత్యేక విభాగాలతో సామాజిక మాధ్యమాలపై ఇప్పటికే నిఘా పెట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగా అనుచితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లాల్లో సోషల్‌ మీడియా సెల్‌లు ఏర్పాటు చేశారు.

click me!