ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గరకొస్తున్న కొద్దీ ఫలితాలపై అంతటా ఉత్కంఠ పెరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్, వివిధ సర్వే సంస్థల అంచనాల నేపథ్యంలో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గెలుపెవరిది? ఓడిపోయే అభ్యర్థులు ఎవరు ? అన్న చర్చ ఎగ్జిట్ పోల్స్ తర్వాత అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపై ఆరా మస్తాన్ చేసిన వ్యాఖ్యలిప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి...
ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు చోట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వైసీపీ అభ్యర్థులు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఓటమి ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ఈ మేరకు ఆరా మస్తాన్ రావు ఓ ఇంటర్ వ్యూలో పేర్కొన్నారు. ''గుడివాడ, గన్నవరం టైట్ నియోజకవర్గాలు. కొడాలి నాని, వల్లభనేని వంశీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు భారీగా మోహరించాయి. వేరేవేరు దేశాల నుంచి కూడా వచ్చి మోహరించారు.'' అని ఆరా మస్తాన్ తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమికే కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయట. అందుకే ఎగ్జిట్ ప్రకటించిన రోజు గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల గురించి ప్రస్తావించలేదని మస్తాన్ చెప్పారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో మరొక్క రోజు వేచి చూడాల్సిందే...
కాగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్ సర్వే ద్వారా తెలిపారు. 94 నుంచి 104 అసెంబ్లీ సీట్లు వైసీపీ దక్కించుకుంటుందని ఆరా ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇక, 71 నుంచి 81 సీట్లకు టీడీపీ కూటమి పరిమితం అవుతుందట. ఓట్ల శాతం పరంగా చూస్తే వైసీపీకి 49.41శాతం, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 47.55 శాతం లభిస్తుందని ఆరా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.