వైకుంఠఏకాదశి వేడుకలు : తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. తెల్లవారుజామునుంచే దర్శనాలు..

By SumaBala BukkaFirst Published Jan 2, 2023, 7:23 AM IST
Highlights

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్టాల్లోని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునుంచే ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. 

నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. అన్ని ఆలయాలకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భద్రాచలం, ద్వారక  తిరుమల, అన్నవరం, విజయవాడ, మంగళగిరి, అనంతపురం, ధర్మపురి లాంటి అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అర్ధరాత్రి 12.05గంటలకే శ్రీవారి దర్శనాలను ప్రారంభించారు. ముందు వీవీఐపీలకు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనాలు చేసుకునేలా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీవాణి ద్వారా టోకెన్లు  తీసుకున్న భక్తులను ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు దర్శనానికి అనుమతించారు. సామాన్య భక్తులకు ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి  అనుమతించారు. భక్తులకు నేటినుంచి జనవరి11 వరకూ తిరుమలలో వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. 

తిరుపతి : వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం ఎగబడ్డ భక్తులు, తోపులాట.. టీటీడీపై విమర్శలు

ఈరోజు ఉదయమే స్వామివారిని దర్శించుకున్నవారిలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే.. తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్, మల్లారెడ్డి..ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, ఉషశ్రీ మేరుగ నాగార్జున ఉన్నారు.

ఇక.. భద్రాద్రి రాముల వారి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర  ద్వార దర్శనం ద్వారా రాములవారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి  భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయం భక్తజన సందోహంగా మారిపోయింది. సింహాచలంలో కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వేకువజామునే ప్రారంభమయ్యాయి. మొదట ఆలయ అనువంశిక ధర్మకర్త అశోకగజపతి రాజు తొలి దర్శనం చేసుకుని.. దర్శనాలు ప్రారంభించారు.

click me!