ఏపీలో మోదీ పర్యటన షెడ్యూల్‌ ఇదే

By Galam Venkata Rao  |  First Published Jun 10, 2024, 9:58 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పర్యటన షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.


కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణంలో ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందని సీఎస్‌ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో  అధికారులతో  సమీక్షించారు.

 

Latest Videos

తాత్కాలిక టూర్ ప్రోగ్రాం ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 12 ఉదయం 8 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి.. 10 గంటల 40 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారన్నారు. 10గంటల 55 నిమిషాలకు కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణానికి చేరుకుని.. 11గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని సీఎస్‌ వెల్లడించారు. అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని 12.45 గంటలకు విమానంలో ప్రధాని మోదీ భువనేశ్వర్ వెళతారని చెప్పారు. ఈ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చేపట్టాలని పోలీసు, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు.

click me!