మద్యం ప్రియులకు మరింత కిక్కిచ్చే న్యూస్ ఇది. ఏపీలో నాసిరకం మద్యం లిక్కర్ బ్రాండ్లకు కొత్త ప్రభుత్వం గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైంది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దు చేసేసి.. నాణ్యమైన బ్రాండ్లను రాష్ట్రంలోకి తిరిగి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది...
ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులు, మద్యం ప్రియులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది. జగన్ హయాంలో తీసుకొచ్చిన బూమ్ బూమ్ లాంటి బ్రాండ్లను పక్కనబెట్టి... నాణ్యమైన మద్యం బ్రాండ్లను తిరిగి ఏపీలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది కొత్త ప్రభుత్వం.
గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మద్యం విధానాన్ని పూర్తిగా మార్చేసింది. మద్య నిషేధం చేపడతామని, పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లకే లిక్కర్ పరిమితం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... ఆ తర్వాత స్వయంగా మద్యాన్ని విక్రయించింది. టెండర్ విధానాన్ని రద్దు చేసేసి.. మద్యం దుకాణాలన్నిటినీ ప్రభుత్వమే నిర్వహించింది. ఉద్యోగులను నియమించి మరీ మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉన్న లిక్కర్ బ్రాండ్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నాణ్యత పక్కన పెడితే పేర్లపైనే దారుణంగా విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి ఏపీలోని మద్యం బ్రాండ్లు. నాణ్యమైన బ్రాండ్లు కనిపించకపోగా... మద్యం ధరలు విపరీతంగా పెంచేయడం కూడా ప్రజలను, మద్యం ప్రియులను ఆగ్రహానికి గురిచేసింది.
ఈ పరిస్థితి మార్చేసేందుకు కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దు చేసేందుకు సీఎంవోలు వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయట. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏపీలో లిక్కర్ పాలసీ రద్దుపై నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీ నాటికి కొత్త మద్యం పాలసీ ఫైనల్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
వైసీపీ తీసుకొచ్చిన మద్యం పాలసీని మార్చేయడంతో పాటు జగన్ ప్రభుత్వంలో మద్యం ద్వారా జరిగిన దోపిడీపై విచారణకు ఆదేశాలిచ్చేందుకు కూడా కొత్త ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా కనీవినీ ఎరుగని రీతిలో వింత బ్రాండ్ లు ఏపీలోనే కనిపించేవి. వాటిని రద్దు చేసి నాణ్యమైన మద్యం బ్రాండ్లను తిరిగి తీసుకొచ్చేలా మద్యం పాలసీ చేయనున్నారు. అలాగే, ప్రస్తుతం ఉన్న డిస్టలరీల లైసెన్సులను రద్దు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 3వేల 600 మద్యం దుకాణాలకు టెండర్ విధానం ద్వారా లైసెన్సులు కేటాయింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కింగ్ ఫిషర్ బీర్లను కంటైనర్లలో తీసుకొచ్చి గోడౌన్లలో నిల్వ చేస్తున్న వీడియోను ఎక్స్ లో పోస్టు చేశారు. ‘‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ.. కింగ్ ది ఫిషర్ చీర్స్’’ అంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు..
It's back all over AP.king the fisher cheers. pic.twitter.com/j1Ott5DXX8
— Anam Venkata Ramana Reddy (@anamramana)
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతా పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. 164 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పలువురు కేంద్ర పెద్దలు, ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే రాజధాని అమరావతిపై ద్రుష్టి పెట్టిన ఎన్డీయే ప్రభుత్వం... భారీగా పెరిగిపోయిన చెట్లు, పొదల తొలగింపునకు చర్యలు చేపట్టింది. వందలాది జేసీబీలతో సీఆర్డీయే పరిధిలోని భూములను బాగు చేయిస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఇక్కడ మరింత వేగంగా పనులు జరగనున్నాయి. అలాగే, పలు కీలకమైన కొత్త నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జగన్ ప్రభుత్వంలో జరిగిన పాలసీలపై సమీక్షలు జరిపి... విధానపరమైన లోపాలు, అవినీతిపై విచారణ జరిపేందుకు కూడా సన్నద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.