
హైదరాబాద్: హైదరాబాద్ లో ముగ్గురు మహిళా మావోయస్టుల అరెస్ట్ కలకలం రేపుతోంది. మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటుండగా పోలీసులు రెక్కీ నిర్వహించి పట్టుకున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు మహిళా మావోయిస్టులు సొంత అక్కచెల్లెళ్లు కావడం విశేషం.
మహిళా మావోయిస్టులు హైదరాబాద్ లో ఉంటున్నారని తెలుసుకున్న విశాఖపట్నం జిల్లా పాడేరు పోలీసులు డీఎస్పీ వీబీ రాజ్ కమల్ నేతృత్వంలోని పోలీసుల బృందం వీరిని అదుపులోకి తీసుకుని విశాఖపట్నం జిల్లా కోర్టు ఎదుట హాజరుపరిచారు. వీరికి కోర్టు 15 రోజులపాటు రిమాండ్ విధించింది.
వీరితోపాటు విశాఖపట్నం జిల్లా పెదబయలు ఏరియా కమిటీ సంపంగిపుట్టి వద్ద పాకెట్ కు చెందిన మిలీషియన్ సభ్యుడు కొర్రా కామేశ్వరరావును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కొర్రా కామేశ్వరరావును సైతం విశాఖపట్నం జిల్లా కోర్టులో హాజరుపరచగా అతనికి కోర్టు 15 రోజులపాటు రిమాండ్ విధించింది.
వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా తిమ్మయ్యపాలెం గ్రామానికి చెందిన రమణయ్య, నరసమ్మ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. రమణయ్య కుల నిర్మూలన పోరాట సమితి కేఎన్పీఎస్ లో పనిచేసేవాడు. ప్రస్తుతం తెలంగాణ ప్రజాఫ్రంట్ లో పనిచేస్తున్నారు. అతని భార్య నరసమ్మ ప్రజాపోరాట సంఘం తరపున హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
అయితే వీరి ముగ్గురు కుమార్తెలు మావోయిజం పట్ల ఆకర్షితులయ్యారు. ఈ ముగ్గురు అక్క చెళ్లెల్లు సీపీఐ మావోయిస్టు, మావోయిస్టు అనుబంధ సంఘాలలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
తండ్రి రమణయ్య కుల నిర్మూలన పోరాట సమితిలో పనిచేస్తున్న సందర్భంలో విప్లవాలకు ఆకర్షితులైన వారు మావోయిజం వైపు దృష్టి సారించారు. దీంతో ఆత్మకూరు భవానీ మెుదట మావోయిజంలో చేరారు. ప్రస్తుతం ఆమె అమరవీరుల బంధు మిత్రుల కమిటీ తరుపున ఆంధ్ర తెలంగాణ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. భవానీని గతంలో కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇకపోతే 33ఏళ్ల అన్నపూర్ణ మహిళా చైతన్య సంఘంలో పనిచేసింది. విశాఖపట్నం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈమెను 2012లో వరంగల్ జిల్లా పోలీసులు ఖానాపూర్ వద్ద అరెస్ట్ చేశారు. ఇకపోతే 24 ఏళ్ల ఆత్మకూరు అనూష గత కొంతకాలంగా చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తూ సీపీఐ మావోయిస్టు పార్టీలో దళం మెంబరుగా కొనసాగుతోంది.
ముగ్గురు అక్కచెళ్లెల్లలో ఆఖరి అమ్మాయి అయిన ఆత్మకూరు అనూష తన సోదరీమణులు ప్రోత్సాహంతో 2017 సవంత్సరంలో మావోయిస్టు దళంలో చేరింది. మావోయిస్టులకు సంబంధించిన చైతన్య మహిళా సంఘంలో చేరింది.
గత ఏడాది అక్టోబర్ 25న మావోయిస్టుల ప్రోత్సాహంతో సీఎంఎస్ తరుపున ఇతర సభ్యులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖపట్నం జీవీఎంసీ ఎదుట ధర్నా చేసింది అనూష. అన్నపూర్ణ మరియు భవానీలు అనూషను మావోయిస్టు పార్టీలో జాయిన్ అవ్వాలని, ప్రభుత్వంపై సాయుధ పోరాటం చెయ్యాలని, పీడిత ప్రజల తరుపున పోరాడాలంటూ కోరారు. దీంతో అనూష సీపీఐ మావోయిస్టు పార్టీ దళంలో చేరింది.
డిసెంబర్ 2017లో ఆత్మకూరు అనూష తన సోదరి అన్నపూర్ణ ద్వారా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు నాయకుడైన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేను కలిసింది. ఆమెను మావోయిస్టు ఉద్యమంలో చేర్చుకున్న ఆర్కే అనూష పేరు యాంగ్జేగా మార్చాడు.
మావోయిస్టు నాయకులైన ఆర్కే మరియ ఉదయ్ యెక్క రక్షణ సిబ్బందితో అనూష యూనిఫాం ధరించి తుపాకీ పట్టుకుని మావోయిస్టు కార్యకలాపాలలో మావోయిస్టు దళ సభ్యురాలిగా చురుగ్గా పాల్గొంది. అలాగే కంప్యూటర్ డీటీపీ ఆపరేటరుగా కూడా పనిచేసింది.
డిసెంబర్ 2017లో కోటిపల్లి-గున్నమామిడి, ఇతర ప్రాంతాలలో మిగిలిన మావోయిస్టులతో కలిసి మిలట్రీ ట్రైనింగ్ పొందింది అనూష. మార్చి 2018న విశాఖపట్నం వచ్చి అక్క అన్నపూర్ణతో కొన్ని రోజులు ఉండి మరలా మావోయిస్టులతో కలిసి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసింది.
అయితే అనూష అనేక నేరాల్లో పాల్గొన్నట్లు పాడేరు డీఎస్పీ వీబీ రాజ్ కమల్ తెలిపారు. 2018 ఫిబ్రవరిలో తిక్కరపాడు వద్ద పోలీసులపై మాటు వేసి కాల్పులు జరిపిన సంఘటనలో ఆమె నిందితురాలుగా పేర్కొన్నారు.
అలాగే 2018 మే లో పాన్ సోదార్ మరియు జుబంబో గ్రామం వద్ద పోలీసులపై మాటు వేసి కాల్పులు జరిపిన ఘటన, 2018 నవంబర్ లో సుధీర్ మరియు రాష్ట్ర కమిటీ మెంబరైన ఆర్కే, ఆదేశాల మేరకు సుర్మతి ఏవోబీ వద్ద రెక్కీ నిర్వహించి పోలీసులపై మందుపాతర పేల్చిన ఘటనలలో ఈమె నిందితురాలుగా పోలీసులు చెప్తున్నారు.
3 నెలల క్రితం దళంలో పనిచేస్తున్న అనూషకు కామెష్ కు మధ్య గరువు అటవీ ప్రాంతంలో అన్నపూర్ణ, భవానీ మరికొంతమంది వచ్చి మావోయిస్టు ఉదయ్ షుగర్ వ్యాధికి సంబంధించి మందులు, విప్లవ సాహిత్యం, మావోయిస్టులు వాడుకునే దుస్తులు దళ సభ్యులకు అందించారు.
ఆ తరువాత ఒక రోజు అనూష బయట పనుల నిమిత్తం వారి అక్కలతో కలిసి హైదరాబాద్ వెళ్లింది. హైదరాబాద్ లో అనూష రెక్కీ నిర్వహించడ కోసం, మావోయిస్టులకు స్థావరాలు ఏర్పాటు చెయ్యడం, మావోలకు అసరమైన వస్తువులు సమకూర్చడం కోసం ఆమె హైదరాబాద్ వెళ్లింది.
ముగ్గురు మహిళా మావోయిస్టులను అరెస్ట్ చేసిన సమయంలో వారి వద్ద నుంచి విప్లవ సాహిత్యం, మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరున కరపత్రాలు, ఈస్టు డివిజన్ కమిటీ ఉత్తరాలు, మావోయిస్టులకు సంబంధించిన ఉత్తరాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇకపోతే మిలీషియన్ సభ్యుడు కొర్ర కామేశ్వరరావును సంపంగి పుట్టు గ్రామంలో అరెస్ట్ చేశారు. కామేశ్వరరావుసైతం పలు నేరాల్లో పాల్గొన్నట్లు పాడేరు డీఎస్పీ డా.వీబీ రాజ్ కమల్ స్పష్టం చేశారు.
2015లో వంతల సత్యారావును మంచంగిపుట్టు వద్ద హత్య చేసిన ఘటనలోనూ, 2017లో మద్యగరువు గ్రామం వద్ద జి.మాడుగుల మండలంలో సూర్యం మరియు కిషోర్ లను హత్య చేసిన సంఘటనలోనూ, 2018 సంవత్సరంలో జక్కం-నానుబారి గ్రామల వద్ద మందుపాతరను పేల్చిన సంఘటన, 2015లో మెయ్యగొమ్మి మరియు సుర్మతి గ్రామాల వద్ద రోడ్డు యంత్రాలను దగ్ధం చేసిన సంఘటనలలో నిందితుడు.
కొర్రా కామేశ్వరరావును అరెస్ట్ చేసిన సమయంలో అతని వద్ద పేలుడు పదార్థాలు, డిటోనేటర్స్, ఎలక్ట్రికల్ వైర్లు వంటి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనూష, కామేష్ లు దళంతో తిరుగుతూ పోలీసులు రాకపోకల సమాచారం మావోయిస్టులకు చేరవేయడం వంటివి చేసేవారని డీఎస్పీ రాజ్ కమల్ తెలిపారు.
అన్నపూర్ణ, భవానిలు విప్లవ సాహిత్యాలను, ముఖ్యమైన ఉత్తరాలను మావోయిస్టులకు చేరవెయ్యడం, మావోయిస్టులకు అవసరమైన నిత్యావసరాలను సమకూర్చడం మరియు స్థావరాలను ఏర్పాటు చెయ్యడం మెుదలైన చట్టవ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ డా.వీబీ రాజ్ కమల్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి