రాజీనామా ఎత్తు; ఈరన్న తెలివి, తిప్పేస్వామి తిప్పలు

By Nagaraju TFirst Published Dec 15, 2018, 4:03 PM IST
Highlights

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివాదంపై చిక్కుముడి వీడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఈరన్న ఎమ్మెల్యేగా అనర్హుడంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అంతకు ముందు హైకోర్టు కూడా ఇదే చెప్పింది. 

అనంతపురం: అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివాదంపై చిక్కుముడి వీడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఈరన్న ఎమ్మెల్యేగా అనర్హుడంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అంతకు ముందు హైకోర్టు కూడా ఇదే చెప్పింది. 

తప్పుడు అఫడవిట్ సమర్పించిన ఈరన్న ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ఎమ్మెల్యేగా తిప్పేస్వామి బాధ్యతలు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ  కార్యదర్శి విజయరాజుకు అందజేశారు. 

అయితే ఈరన్న తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శి విజయరాజుకు అందజెయ్యడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు అవగతమవుతోంది. ఈరన్న రాజీనామా శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అందజెయ్యకుండా అసెంబ్లీ కార్యదర్శికి అందజెయ్యడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ఉన్నత న్యాయస్థానాల తీర్పు నుంచి తప్పించుకోవడానికే ఇలా రాజీనామా చేశారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి వద్ద ఉన్న రాజీనామా స్పీకర్ దృష్టికి వెళ్లాలి ఆయన రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుంది. స్పీకర్‌ ఆమోదించేవరకూ ఈరన్న ఎమ్మెల్యేగానే కొనసాగే అవకాశం ఉంటుంది.

శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఏ విషయం తేల్చకుండా రాజీనామా లేఖను అలాగే రెండు, మూడు నెలలు కాలం గడిపితే ఈ అసెంబ్లీ సమయం ముగిసిపోతుంది. అప్పటివరకూ ఈరన్న ఎమ్మెల్యేగా కొనసాగవచ్చని టీడీపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అందుకే ఈరన్నతో రాజీనామా చేయించినట్లు భావిస్తున్నారు.

ఈరన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ముందు రోజు అంటే గురువారం సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు లోకేష్ లను కలిశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని ఈరన్నను ఎమ్మెల్యే పదవిలో కొనసాగేలా చంద్రబాబు నాయుడు ప్లాన్ వేసినట్లు వైసీపీ ఆరోపిస్తుంది.  

ఈరన్నపై నాలుగేళ్లుగా పోరాటం చేసిన వైసీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయ కర్త తిప్పేస్వామి కోర్టు తీర్పుతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ టీడీపీ వేస్తున్న ఎత్తులతో నీరుగారిపోతున్నారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలపై వేటు వెయ్యాలంటూ వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందించని పరిస్థితి. 

ఇదే నేపథ్యంలో ఈరన్న రాజీనామాను కూడా రెండు మూడు నెలలు కాలం వరకు ఏ విషయం తేలకుండా ఉంచితే తన ఆశ నెరవేరదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన పోరాటానికి న్యాయ స్థానాలు న్యాయం చేసినా టీడీపీ మాత్రం అన్యాయం చేస్తోందంటూ వాపోతున్నారు తిప్పేస్వామి. 

ఈరన్న ఎమ్మెల్యేనే కానప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం హాస్యాస్పదంగా ఉందని తిప్పేస్వామి అంటున్నారు. కోర్టుల తీర్పుల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేనే కాదన్నారు.
ధర్మాసనాల తీర్పు ప్రకారం తనతో ఈ నెల 20న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శిలను కోరారు తిప్పేస్వామి. 

ప్రమాణస్వీకారంపై ఇరువురికి ఫ్యాక్స్, ఈ–మెయిల్‌ చేసినట్లు తిప్పేస్వామి వెల్లడించారు. తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను కూడా పంపినట్లు తెలిపారు. స్పీకర్‌ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, కోర్టు ఉత్తర్వులను గౌరవించి తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

మరోవైపు మడకశిర ఎమ్మెల్యే ఈరన్న అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, కోన రఘుపతి, తిప్పేస్వామి అసెంబ్లీ కార్యదర్శి విజయరాజుకి అందజేశారు. తిప్పేస్వామిచేత ప్రమాణ స్వీకారం చెయ్యించాలని కోరారు.   

అధికార పార్టీ ఎమ్మెల్యే ఈరన్న విషయంలో సుప్రీంకోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిదని వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అభిప్రాయపడ్డారు. నేర చరితుడైన నేతను టీడీపీ ఇన్నాళ్లు కాపాడిందని, అలాంటి వారిని ఎమ్మెల్యేగా తెచ్చి అసెంబ్లీని మలినం చేసిందని మండిపడ్డారు. తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని స్పీకర్‌కి కోర్టు స్పష్టంగా చెప్పినా సన్నాయి నొక్కులు నొక్కుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కోర్టు తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత స్పీకర్‌కి, ముఖ‍్యమంత్రి చంద్రబాబునాయుడికి లేదా అని ప్రశ్నించారు. 24 గంటల్లోగా కోర్టు తీర్పుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు 27వ తేదీన ఈరన్న ఎమ్మెల్యే కాదని తీర్పు ఇస్తే శుక్రవారం రాజీనామా చేయటం ఏంటని ప్రశ్నించారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీకి షాక్: ఎమ్మెల్యే రాజీనామా

టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్, ఎన్నిక చెల్లదంటూ తీర్పు

click me!