
నంద్యాల ఉపఎన్నిక ఫలితం కోసమే పవన్ కల్యాణ్ ఎదురు చూస్తున్నారా? నంద్యాల ఉపఎన్నికకు, పవన్ కు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా? రాబోయే ఎన్నికలో కూడా పవన్ కింగ్ మేకర్ అవుతారని ఇటు టిడిపి అటు వైసీపీలు అనుకుంటున్న సంగతి తెలిసిందే కదా? అందుకనే తమతోనే చేతులు కలపాలని వైసీపీ తరపున ప్రశాంత్ కిషోర్ పవన్ తో దోస్తీకి జగన్ తరపున రాయబారం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో తమతోనే పవన్ను అట్టి పెట్టుకోవాలని చంద్రబాబునాయుడి తాపత్రయమూ అందరూ చూస్తున్నదే.
సరిగ్గా ఈ పరిస్ధితినే పవన్ అవకాశంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రెండింటిలో ఏ పార్టీవైపు వెళ్ళాలన్న మీమాంశలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తన సందిగ్దత తొలగాలంటే నంద్యాల ఉపఎన్నికనే మార్గంగా పవన్ యోచిస్తున్నారు. ఉపఎన్నికలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటే ఎలాగుంటుందన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు కనబడుతోంది. అందుకనే ఉపఎన్నిక విషయం పోటీ చేస్తానని కానీ లేదా మద్దతు ఇస్తానని కానీ ఎక్కడా మాట్లాడటం లేదు.
పవన్ మౌనం వల్ల జనసేన పార్టీలో అయోమయం సృష్టిస్తోంది. మామూలు జనాలు అడగాలన్నా పవన్ ఎటూ అందుబాటులో ఉందరు. మరి జనసైనికుల పరిస్ధితి అదికాదు కదా? నిత్యమూ జనాల మధ్యలో ఉండేవారిని పవన్ గురించి అడిగే ప్రశ్నలకు వీరు సమాధానం చెప్పలేకున్నారు.
కాకపోతే, రాష్ట్ర రాజకీయాలు మొత్తం నంద్యాల ఉపఎన్నికల చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే కదా? శిధిలమైపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఉపఎన్నికల్లో బలమైన అభ్యర్ధిని నిలబెడుతున్నట్లు ప్రకటించేసింది. మరి, పోయిన ఎన్నికల్లో కింగ్ మేకర్ గాను వచ్చే ఎన్నికల్లో ఏకంగా కింగే అవ్వాలనుకుంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ వైపు నుండి మాత్రం ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా లేదింత వరకూ. అక్కడే జనసేను అభిమానించే వారికి ఇబ్బందిగా తయారైంది. చూద్దాం నంద్యాల ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు తెస్తుందో?