చార్జిషీట్లో వైఎస్ భారతి పేరు ఉంది కానీ...: ఎల్లో మీడియాపై తమ్మినేని భగ్గు

By pratap reddyFirst Published Aug 10, 2018, 5:48 PM IST
Highlights

ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో వైఎస్ భారతి పేరు ఉందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం అంగీకరిస్తూనే ఆ వార్తాకథనం రాసిన మీడియాపై భగ్గుమన్నారు. ఆ వార్త లీకు కావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌: ప్రజల మధ్య ఉంటూ విశేష ప్రజాదరణ పొందుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం ఖండించారు. జగన్ పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఎల్లో మీడియా సహించలేకపోతోందని ఆయన అన్నారు. 
భారతి సిమెంట్స్ లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్ భారతీ రెడ్డి పేరును ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లో చేర్చడాన్ని ఆయన ఖండించారు. భారతి సిమెంట్స్ పెట్టుబడుల విషయంలో అంతా సవ్యంగా ఉన్నప్పటికీ భారతిరెడ్డి పేరును చార్జిషీట్ లో చేర్చడం దురుద్దేశపూర్వకంగా సాగిందని ఆయన అన్నారు. 

రాజకీయ దురుద్దేశంతో జగన్ మోహన్ రెడ్డిపై అనేక కేసులు దాఖలుకాగా ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆయన భార్య భారతీ రెడ్డి పేరు చార్జిషీటులో చేర్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని అడిగారు. భారతి సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించి చట్టబద్దం కానిది ఏముందో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఏడేళ్ల తర్వాత వైఎస్‌ భారతి పేరును చార్జిషీట్‌లో ఎందుకు చేర్చాల్సి వచ్చిందని, ఏడేళ్ల తర్వాత భారతి పేరును చార్జిషీట్‌లో చేర్చడంలోని ఆంతర్యమేమిటని ఆయన అడిగారు. భారతీ సిమెంట్స్‌ మెజారిటీ వాటాను ఫ్రాన్స్‌ కంపెనీ వికా కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలుసని ఆయన గుర్తు చేశారు. 

చార్జిషీట్‌లో తన పేరును పెట్టిన విషయం భారతీరెడ్డికి తెలిసే కన్నా ముందుగా ఎల్లో మీడియాకు ఎలా లీకైందని అడిగారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ లో పనిచేస్తున్న ఉమాశంకర్‌ గౌడ్‌, గాంధీ అనే అధికారులతో టీడీపీకి సంబంధాలున్నాయన్న విషయంపై గతంలోనే ఫిర్యాదు చేశామని, ఆ అధికారులే టీడీపీకి లీకులు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు అంతా సక్రమంగానే జరిగాయని స్పష్టం చేస్తూ ఈ కేసును టీడీపీ అభిష్టానికి అనుగుణంగా బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. 

బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబుకు ఫెవికాల్‌ బంధం ఉందని, చంద్రబాబు శాశ్వత మిత్రుడని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఓటుకు నోటు  కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా చంద్రబాబుపైన చర్యలు తీసుకోలేదని అంటూ ఇన్నేళ్లయినా ఆ కేసు ముందుకు సాగకపోవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 

ప్రజలనుంచి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక జగన్ మోహన్ రెడ్డిపై ఇలా ఎన్ని తప్పుడు కేసులు బనాయించినప్పటికీ ఆయన ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని, తప్పుడు ప్రచారం సాగిస్తున్న వారికి ప్రజలు తగిన సమయంలో బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు.

click me!