చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఆదివారం నాడు ఉద్రిక్తత నెలకొంది.
చిత్తూరు: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఆదివారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రాజధానులకు అనుకూలంగా చంద్రబాబునాయుడు స్వంత గ్రామం నారావారిపల్లెలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ బహిరంగ సభను తలపెట్టారు. ఈ సభకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకొంది.
Also read:సేవ్ అమరావతి: పెళ్లి పత్రికపై సురేష్ వినూత్న ప్రచారం
మూడు రాజధానులకు మద్దతుగా చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఆదివారం నాడు నారావారిపల్లెలో ఆదివారం నాడు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆరుగురు మంత్రులు పాల్గొంటారు.
ఈ సభను చంద్రబాబు నివాసానికి అతి సమీపంలో నిర్వహిస్తున్నారు. ఈ సభ నిర్వహణపై నారావారిపల్లెకు చెందిన టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభ నిర్వహణను నిరసిస్తూ ఆదివారం నాడు టీడీపీ శ్రేణులు గ్రామంలో ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకొన్నారు.
మూడు రాజధానులను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.రాజధాని అమరావతికే అనుకూలంగా నారావారిపల్లెవాసులు నినాదాలు చేశారు.
టీడీపీ కార్యకర్తలు ఇళ్లలో నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకొంటున్నారు. ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. దీంతో గ్రామస్థులు వైసీపీ సభపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.