కర్నూల్ జిల్లాకు చెందిన టెక్కీ చైనాలోని వుహాన్ లో చిక్కుకొంది.
కర్నూల్: కర్నూల్ జిల్లాకు చెందిన టెక్కీ చైనాలోని వుహాన్ లో చిక్కుకొంది. చైనాలో ట్రైనింగ్ కోసం వెళ్లిన తెలుగు టెక్కీ జ్యోతిని ఇండియాకు రప్పించేందుకు వెళ్లిన రెండు విమానాల్లో అధికారులు ఆమెను తీసుకొచ్చేందుకు నిరాకరించారు. జ్వరం ఎక్కువగా ఉన్న కారణంగానే ఆమెను విమాన ప్రయాణానికి అనుమతించలేదని బాధితురాలు చెబుతున్నారు.
ఓ ప్రైవెట్ కంపెనీలో చిత్తూరు జిల్లాలో సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న జ్యోతి చైనాలో ట్రైనింగ్ కోసం రెండు మాసాల క్రితం చైనా వెళ్లింది.చైనాకు వెళ్లిన తెలుగు టెక్కీల బృందంలో జ్యోతి కూడ ఉంది. ఆమెది కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల నియోజకవర్గంలోని ఈర్ఘపాడు గ్రామం. కంపెనీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె చైనాకు వెళ్లింది.
Also read:కరోనా వైరస్: చైనాలోనే తెలుగు టెక్కీలు, ఆందోళనలో కుటుంబాలు
చైనా వుహాన్‌లో ఉన్న తెలుగు టెక్కీలను ఇండియాకు రప్పించేందుకు గాను రెండు విమానాలను ఇండియా నుండి శనివారం నాడు పంపారు.అప్పటికే ఆమె జ్వరంతో ఉంది. దీంతో ఆమెను విమానం ఎక్కించుకొనేందుకు అధికారులు నిర్వహించారు.
మరో వైపు రెండో విమానం ఇండియాకు రావాలని శృతిని అధికారులు కోరారు. రెండో విమానంలో కూడ ఆమెను అధికారులు అనుమతించలేదు. జ్వరం ఎక్కువగా ఉన్నందున ఆమెకు కరోనా వైరస్ ఉందని భావించి ఆమెను విమానంలో ఎక్కించుకోలేదు.
తనకు కరోనా వైరస్ లక్షణాలు లేవని వైద్యులు కూడ చెప్పారని జ్యోతిని చెప్పారు. ఈ విషయమై ఆమె పరీక్షలకు కూడ సిద్దమేనని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తనను అధికారులు చైనాలోనే వదిలిపోయిన విషయమై బాధను వ్యక్తం చేస్తూ ఆమె వీడియోను రికార్డు చేసి తన తల్లికి పంపింది,
తన కూతురిని ఇండియాకు రప్పించాలని జ్యోతి కుటుంబసభ్యులు కోరుతున్నారు. తన కూతురికి ఎలాంటి కరోనా వైరస్ వ్యాధి లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
జ్యోతికి ఈ నెల 14వ తేదీన వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. గతంలోనే జ్యోతికి నిశ్చితార్థం చేశారు. జ్యోతిని ఇండియాకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు చెప్పారు.