జగన్ ఆరోపణలు నిజమని అంగీకరించిన టిడిపి

First Published Jan 6, 2018, 8:49 AM IST
Highlights
  • ‘‘రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్ళ తర్వాత కూడా హామీలు అమలు కాకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి’’..ఇది టిడిపి ఎంపిల ఆందోళన.

‘‘రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్ళ తర్వాత కూడా హామీలు అమలు కాకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి’’..ఇది టిడిపి ఎంపిల ఆందోళన. ఈ ఒక్క మాట చాలు వచ్చే ఎన్నికల్లో విజయంపై టిడిపి ఏ స్ధాయిలో ఆందోళన పడుతోందో చెప్పటానికి. ఇంతకాలం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను టిడిపిలు అంగీకరించినట్లైంది. హామీల అమలుపై కేంద్రమంత్రి సుజనాచౌదరి నేతృత్వంలో టిడిపి ఎంపిలు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు.

 

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు కాని విషయాన్ని  గుర్తు చేసారు. అప్పట్లో ఇచ్చిన హామీలన్నీ కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైనట్లు ఎంపిలు మోడితో ఫిర్యాదు చేసారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ప్రజాల్లోకి ఎలా వెళ్ళాలంటూ ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రత్యేకంగా ఓ టాస్క్ ఫోర్స్ వేసి సమీక్షించాలంటూ ప్రధానిని వేడుకున్నారు. అనేక విషయాల్లో రాష్ట్రం తీవ్ర కష్టాల్లో ఉందని, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు. విభజన సమయంలో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చ లేదన్న విషయాన్ని గుర్తుచేసారు.

 

ప్రత్యేకసాయం, విశాఖపట్నం రైల్వేజోన్, నియోజకవర్గాల సంఖ్య పెంచటం లాంటివి పెండింగ్ లో ఉందన్నారు. ప్రత్యేకసాయం క్రింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 20 వేల కోట్లు ఇంకా రాలేదన్నారు. విభజన జరిగి మూడున్నరేళ్ళ తర్వాత కూడా 80 శాతం కార్పొరేషన్లు, కంపెనీల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన జరగలేదని చెప్పారు.

 

సరే, ఈ విషయాలేవీ ప్రధానికి తెలియనివి కావు. ఎందుకంటే, ఏపి ప్రయోజనాలను కాపాడటంలో మొదటి నుండి నరేంద్రమోడినే అడ్డంకి. విభజన చట్టంలో పేర్కొన్న హామీలే అమలు కాకపోతే ఇక మిగిలిన వాటి గిరించి పట్టించుకునేదెవరు? ఏదేమైనా మోడి-చంద్రబాబు మధ్య సంబంధాలు బాగా క్షీణించాయన్న విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. ఎంపిలతో మాట్లాడుతూ, చంద్రబాబు, తాను త్వరలో కలవబోతున్నట్లు చెప్పారట. తన అపాయిట్మెంట్ కావాలని చంద్రబాబు అడిగినట్లు మోడినే చెప్పారట.

 

గడచిన ఏడాదిన్నరగా మోడి అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబును ప్రధాని దూరం పెడుతున్నారన్న విషయం తెలిసిపోతోంది. వైసిపి నేతలను కలుస్తున్న మోడి ముఖ్యమంత్రికి మాత్రం అపాయిట్మెంట్ ఇవ్వటం లేదంటేనే విషయం అర్ధమైపోతోంది. ఒకవైపేమో 2019 ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. ఒకవేళ భాజపాతో పొత్తు ఉండకపోతే ఏమి చేయాలనే విషయంలో టిడిపి ముందు జాగ్రత్త పడుతున్నట్లు కనబడుతోంది.

click me!