
ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఆందోళన పెరిగిపోతోంది. మంత్రిపదవుల కోసం కొందరు, ఇతర ప్యాకేజీలపై ఆశపడి మరికొందరు తెలుగుదేశంలోకి ఫిరాయించారు. నియోజకవర్గాల సంఖ్య 175 నుండి 225కి పెరుగుతుంది కాబట్టి అందరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు సర్దబాటు చేస్తానని చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు పార్టీలోకి దూకారు. అయితే, తాజాగా చంద్రబాబు టిడీఎల్పిలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో సీట్ల పెంపు ఉన్నా లేకపోయినా అన్నీ టిడిపినే గెలవాలని చెప్పారు.
ఇపుడు ఆ విషయం మీదే ఫిరాయింపు ఎంఎల్ఏల్లో చర్చ మొదలైనట్లు సమాచారం. ఒకవేళ సీట్ల సంఖ్య పెరగకపోతే తమ భవిష్యత్తు ఏమిటో వారికి అర్ధం కావటం లేదు. మొన్నటి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మాట్లాడుతూ, ఇది ఎన్నికల మత్రివర్గం అంటూ చంద్రబాబు చెప్పారు.
అంటే, దాదాపు మంత్రివర్గ విస్తరణ కూడా లేనట్లే. కాబట్టి భవిష్యత్తులో తమకు మంత్రివర్గంలో చోటుదొరుకుతుందని ఆశించిన వారికి తీవ్ర భంగపాటే. 21 మంది ఎంఎల్ఏలు ఫిరాయించగా 4 గురికి మంత్రివర్గంతో చోటు దక్కిన సంగతి అందరికీ తెలిసిందే కదా? మిగిలిన వారిలో ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది.
ప్రజాప్రతినిధులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేది లేదని చంద్రబాబు మొన్ననే స్పష్టం చేసారు. ఫిరాయింపు ఎంఎల్ఏల్లో కొందరికి నామినేటెడ్ పోస్టులిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంటే నామినేటెడ్ పోస్టులు కూడా ఫిరాయింపు ఎంఎల్ఏలకు దక్కే అవకాశం లేదు. అదే సమయంలో ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. దాంతో ఫిరాయింపులకు దిక్కు తోచటం లేదు.
అంటే, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కుతుందో లేదో కూడా తెలీదు. దక్కినా ప్రజా వ్యతిరేకతను అధిగమించి బయటపడే మార్గం కనబడటం లేదు. మంత్రివర్గంలో చోటు దక్కక, నామినేటెడ్ పోస్టులూ రాక చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా దొరకటం లేదు. దాంతో ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఆందోళన పెరిగిపోతోంది.