
ఏ ఎంఎల్ఏ అయినా తన నియోజకవర్గంలో తిరగటానికి వెనకాడుతారా? అందునా అధికార పార్టీ ఎంఎల్ఏ? హిందుపురం ఎంఎల్ఏ బాలకృష్ణ గురించే ఈ చర్చంతా. ప్రతిపక్ష ఎంఎల్ఏలు కూడా తమ నియోజకవర్గాల్లో నిర్భయంగా తిరుగుతున్నపుడు తన నియోజకవర్గంలో తిరగటానికి బాలయ్య ఎందుకు వెనకాడుతున్నారు? అదికార పార్టీ ఎంఎల్ఏ కాబట్టే. బాలయ్య పోటీ చేస్తున్నాడని తెలియగానే అబివృద్ధి విషయంలో జనాలు చాలా ఎక్కువ ఊహించేసుకున్నారు. కానీ వాస్తవంగా అందుకు భిన్నంగా జరుగుతోంది.
ముఖ్యమంత్రికి బావమరది కమ్ వియ్యంకుడు కమ్ మంత్రికి మావగారైన బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఎలాగుండాలి? బ్రహ్మాండంగా ఉంటుందని అనుకుంటారు ఎవరైనా. కానీ ఎక్కడ చూసినా సమస్యలే. దాంతో జనాలు ఇపుడు బాలకృష్ణ మీద మండిపడుతున్నారు.
పోయిన ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి బాలయ్య హిందుపురం నియోజకవర్గంలో పెద్దగా తిరిగింది లేదు. మొత్తం వ్యవహారాన్నంతా పిఏకే వదిలిపెట్టేసారు. దాంతో పిఏ తానే ఎంఎల్ఏ అన్నట్లు వ్యవహరించారు. దాంతో నియోజకవర్గమంతా అస్తవ్యస్ధంగా తయారైంది. పిఏ కారణంగా పార్టీలోని నేతలందరూ బాలకృష్ణపై తిరుగుబాటు లేవదీసారు. దాంతో తత్వం బోధపడిన బాలయ్య పిఏని బలవంతంగా వదిలించుకున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో మంచినీటి సమస్య పెరిగిపోయిందంటూ ఆందోళనలు మొదలయ్యాయి.
ఆమధ్య మంచినీటి సమస్య మీదే హిందుపురం పట్టణంలోని మహిళలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేసారు. ఆ సమయంలో గేదెలపై ‘ఎంఎల్ఏ బాలకృష్ణ’ అంటూ రాసి ఊరేగింపు జరిపారు. దాంతో ప్రభుత్వంతో పాటు పార్టీ పరువు కూడా పోయిందంటూ చంద్రబాబునాయుడు, బాలకృష్ణ స్ధానిక నేతలపై మండిపడ్డారు. ఇది జరిగిన తర్వాత కూడా మంచినీటి సమస్య పరిష్కారం కాలేదు. దాంతో జనాల్లో ఇంకా వ్యతిరేకత పెరిగిపోయింది.
చివరిసారిగా బాలకృష్ణ నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది పోయిన నవంబర్లో. ఇప్పటికి మూడుసార్లు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లుచెప్పివాయిదా వేసుకున్నారు. దాంతో నియోజకవర్గంలో తిరగటానికి బాలయ్య భయపడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.