చంద్రబాబులో టెన్షన్..టెన్షన్

First Published Jan 20, 2018, 6:49 AM IST
Highlights
  • చంద్రబాబునాయుడుకు ఏమైంది? ఇపుడీ ప్రశ్నే అందరినీ వేధిస్తోంది.

చంద్రబాబునాయుడుకు ఏమైంది? ఇపుడీ ప్రశ్నే అందరినీ వేధిస్తోంది. ఎందుంకటే, చంద్రబాబు మాటల్లో తేడా కనబడుతోంది. చుట్టుముడుతున్న సమస్యలు చంద్రబాబులో టెన్షన్ పెంచేయటం వల్లే పూర్తిగా సంయమనం కోల్పోయి మాట్లాడేలా చేస్తోందిని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రింకోర్టుకు వెళతానని ప్రకటించటం కూడా అందులో భాగమే అని పార్టీ వర్గాలంటున్నాయ్. చంద్రబాబు వరస చూస్తుంటే త్వరలోనే కేంద్రప్రభుత్వం నుండి తన మంత్రులను ఉపసంహరించుకుంటారా అన్న అనుమానాలు వస్తున్నాయ్.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే ఆయనేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్దం కావటం లేదు. తాజాగా రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. రాష్ట్ర విభజన సమస్యలు, పరిష్కారాల గురించి మాట్లాడుతూ, విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయకపోతే అవసరమైతే సుప్రింకోర్టుకైనా వెళతానంటూ విచిత్రమైన ప్రకటనొకటి చేశారు. పైగా రాష్ట్ర ప్రస్తుత దుస్ధితికి యూపిఏ చేసిన అడ్డుగోలు విభజనే కారణమంటూ చెప్పటం మరీ విచిత్రంగా ఉంది.

సుప్రింకోర్టు విషయమే చూస్తే, కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాల్లో టిడిపి-భాజపాలు భాగస్ధులన్న విషయం అందరికీ తెలిసిందే. మూడున్నరేళ్ళుగా అధికారాన్ని అనుభవిస్తూ, కేంద్రాన్ని పలెత్తు మాట కూడా అనని చంద్రబాబు హటాత్తుగా సుప్రింకోర్టుకు వెళతామని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమొచ్చిందంటే, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ముందుజాగ్రత్త పడుతున్నారు. రేపటి రోజున భాజపాతో పొత్తుండకపోతే ప్రజల ముందు భాజపాను దోషిగా నిలబెట్టేందుకు చంద్రబాబు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

అదే సమయంలో దోషత్వం టిడిపికి అంటకుండా జాగ్రత్తపడుతున్నారు. అందుకనే పోలవరం, రాజధానికి నిధులు, లోటు భర్తీ తదితరాల విషయంలో సందర్భం వచ్చినపుడల్లా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను పోరాటం చేస్తూనే ఉన్నాను అన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. ఇదంతా జనాలు నమ్ముతారా లేదా అన్నది వేరే విషయం.  మొత్తానికి రేపటి ఎన్నికల్లో ఎదురవ్వబోయే ప్రజావ్యతిరేకత మొత్తాన్ని భాజపా పైకి మళ్ళించేందుకు పావులు కదుపుతున్నది వాస్తవం.

అదే సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై కేంద్రంలోని ముఖ్యులు ఆచుతూచి మాట్లాడుతున్నారు. చంద్రబాబు కేంద్రంపై చేస్తున్న వ్యాఖ్యలను భాజపా జాతీయ నాయకత్వం చాలా నిశితంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు భాజపా ఢిల్లీకి నివేదికలు తెప్పించుకుంటోందట. చంద్రబాబంటే పడిని భాజపా నేతల్లో కొందరు రోజువారీ పరిణామాలను ఢిల్లీకి చేరవేస్తున్నట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రేపటి ఎన్నికలను మిత్రపక్షాలు కలిసి ఎదుర్కొనే విషయంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

click me!