పోస్టుల భర్తీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

First Published Jan 19, 2018, 5:06 PM IST
Highlights
  • సంక్షేమ పథకాల అమలులో అవకతవకల వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంక్షేమ పథకాల అమలులో అవకతవకల వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో శుక్రవారం రెండో రోజు మాట్లాడుతూ, రేషన్, పిడిఎఫ్ అమలులో అవకతవకలు జరుగుతున్నట్లు మండిపడ్డారు. పథకాల అమలు సక్రమంగా లేనందువల్లే ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోందని చెప్పటం విడ్డూరంగా ఉంది. పథకాల అమలులో అడుగడుగునా అధికారపార్టీ నేతలే అడ్డుతగులుతుంటే యంత్రాంగం మాత్రం ఏమి చేయగలుగుతుంది.

గ్రామస్ధాయి నుండి రాజధాని వరకూ ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతలదే పెత్తనమైపోయింది. గ్రామస్ధాయిలో జన్మభూమి కమిటీల పేరుతో నేతలు ఓ మాఫియా లాగ తయారయ్యారంటూ వైసిపి ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలంటే కచ్చితంగా జన్మభూమి కమిటీ సిఫారసులుండాల్సిందే. ఇక్కడే నేతలు భారీ అవినీతికి పాల్పడుతున్నారు.

క్షేత్రస్ధాయిలో వాస్తవాలు ఈ విధంగా ఉంటే చంద్రబాబు మాత్రం అధికారులను తప్పుపడుతున్నారు. రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు, ప్రజా సాధికార సర్వేను అనుసంధానం చేయాలని అన్నారు. ఒకే కుటుంబంలో అవసరం అనుకుంటే ఇద్దరికి మించి ప్రయోజనం పొందినా పర్వాలేదుకానీ, ఎక్కడా అవకతవకలు జరిగేందుకు అవకాశం లేకుండా చూడాలని సీఎం అన్నారు. ప్రొసీజర్, సూపర్‌వైజింగ్ సరిగాలేదని ఆయన అన్నారు.

2019 జనవరి నాటికి ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామాల్లో 2 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో మరో 10 వేల ఇళ్లల్లో గృహప్రవేశాలు జరగనున్నాయని అన్నారు. పేదల ఇళ్ల స్థలాల వారసత్వ హక్కులు అర్హులకు ఇవ్వాలని అన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేపట్టిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని చంద్రబాబు ఆదేశించారు.

click me!