
తెలుగుదేశం పార్టీలో ఆందోళన మొదలైంది. స్ధానిక సంస్ధలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పోలింగ్ లో ఎదురు దెబ్బ తగులుతుందేమోనని నేతల్లో టెన్షన్ పట్టుకుంది. స్ధానిక సంస్ధల కోటా, ఉత్తరాంధ్ర, రాయలసీమలో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మొత్తం 8 ఎంఎల్సీ స్ధానాల కోసం పోటీ జరుగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో మిత్రపక్షం భాజపా అభ్యర్ధి పోటీ చేస్తుండగా మిగిలిన అన్నీ స్ధానాల్లో టిడిపినే పోటీ చేస్తోంది. ఇందులో కూడా స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే వైసీపీ పోటీ చేస్తోంది. మిగిలిన స్ధానాల్లో స్వతంత్ర అభ్యర్ధులకు మద్దతు ఇస్తోంది.
అధికారంలో ఉండి కూడా మిత్రపక్షాలు ఇబ్బందులు పడుతున్నాయంటే పరిస్ధితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ కావాల్సిన మూడు జిల్లాల్లోనూ టిడిపి వెనకబడింది. ఇక పట్టభద్రుల నియోజకవర్గాలు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కూడా బాగా ఇబ్బందులు పడుతోంది. ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో ఏకంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయడుతో సహా మొత్తం పార్టీ యంత్రాంగమంతా విశాఖలోనే క్యాంప్ వేసింది. వైసీపీ మద్దతు ప్రకటించిన పిడిఎఫ్ అభ్యర్ధులు పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బాగా ముందంజలో ఉండటంతో అధికారపార్టీ ఇబ్బందులు తప్పటం లేదు.