చంద్రబాబుపై 'కమ్మ' వ్యాఖ్యలు: వల్లభనేని వంశీకి తెలుగు యువత నేత కౌంటర్

By telugu teamFirst Published Aug 23, 2020, 6:47 AM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద తెలుగు యువత నేత నాదెండ్ల బ్రహ్మం మండిపడ్డారు. జగన్ కుల రాజకీయాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడిపై కమ్మ కులం పేరుతో వ్యాఖ్యలు చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి తెలుగు యువత నేత నాదెండ్ల బ్రహ్మం కౌంటర్ ఇచ్చారు. వల్లభనేని వంశీపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వల్లభనేని వంశీ కుల రాజకీయాలు ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి చంద్రబాబును విమర్శించడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం కమ్మకులానికి చెందినవారనే కారణంతో పలువురు అధికారులను జగన్ వెంటాడి వేధించిన విషయం వల్లభనేని వంశీకి కనిపించలేదా అని కూడా అడిగారు. 

వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తన విధేయతలను మార్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చేరువయ్యారు. ఆయన సాంకేతికంగా మాత్రమే వైసీపీలో చేరలేదు. దాదాపుగా వైసీపీ శాసనసభ్యుడి మాదిరిగానే వ్యవహరిస్తున్నారు.

ఆ క్రమంలో రమేష్ ఆస్పత్రిపై హీరో రామ్, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ సినిమాలు కేవలం కమ్మకులం వాళ్లే చూస్తారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని, తన సమస్యలను కులానికి అంతటికీ వచ్చిన సమస్యగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు వల్ల కమ్మకులానికి ముప్పు ఉందని అన్నారు.

click me!