
నేపాల్ రాజధాని ఖాట్మండులో మంగళగిరికి చెందిన ఎనిమిది మంది పౌరులు ఇరుక్కుపోయారు. వారు పశుపతి ఫ్రంట్ హోటల్‌లో తలదాచుకున్నారు. తమ పరిస్థితిని మంత్రి నారా లోకేష్‌తో కాల్ ద్వారా పంచుకున్నారు. నిన్న తమ బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారని, ప్రస్తుతం మరో 40 మంది తెలుగువారితో కలిసి సురక్షితంగా ఉన్నామని వెల్లడించారు.
అమరావతి ఆర్టీజిఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చిక్కుకున్న వారి వివరాలను జిల్లా వారీగా సేకరించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి రెండు గంటలకు నివేదికలు అందించాలని సూచించారు. అంతేకాకుండా విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖలతో సమన్వయం కొనసాగిస్తున్నారు.
నేపాల్‌లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. బాధితుల బంధువులు ఢిల్లీలోని ఏపీ భవన్‌ను 9818395787 నంబర్‌లో సంప్రదించవచ్చు. లోకేష్ బాధితులతో నేరుగా మాట్లాడి గదులలోనే ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని సురక్షితంగా తిరిగి తీసుకువస్తుందని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఖాట్మండు విమానాశ్రయం మూసివేసినప్పటికీ తిరిగి ప్రారంభమైన వెంటనే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. విజయవాడ, విశాఖపట్నం వైపు విమానాలు నడపాలని ప్రణాళిక చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తిని వారి స్వస్థల జిల్లాలకు సురక్షితంగా చేరేలా చూస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలు సహా దాదాపు 261 మంది ఆంధ్రప్రదేశ్ వాసులు చిక్కుకున్నారని గుర్తించారు. బఫాల్, పశుపతి, పింగలస్థాన్, సిమికోట్ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఉన్నట్లు సమాచారం. వారందరి భద్రత, ఆహారం, వైద్య సహాయం కోసం సమన్వయ బృందాలను ఏర్పాటు చేశారు. సిఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు, జనసేన ప్రతినిధులు, ఏపీ భవన్ అధికారులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు.