వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు నేపథ్యంలో సమన్వయం కోసం కమిటీని నియమించింది టీడీపీ. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జనసేనతో సమన్వయం కోసం కమిటీని నియమించామని అచ్చెన్నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. టీడీపీ , జనసేన పార్టీ మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసి వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేసి సంచలనం రేకెత్తించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి నడుస్తుందని ఆయన వెల్లడించారు. పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి విజయయాత్రలో టీడీపీ శ్రేణులు కూడా కదం తొక్కాయి. పొత్తు నేపథ్యంలో తెలుగుదేశంతో సమన్వయం కోసం నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన పవన్ కల్యాణ్ ఓ సమన్వయ కమిటీని నియమించారు.
ఇప్పుడు ఇదే బాటలో టీడీపీ కూడా నడిచింది. జనసేనతో సమన్వయం కోసం కమిటీని నియమించింది. ఈ మేరకు ఆదివారం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జనసేనతో సమన్వయం కోసం కమిటీని నియమించామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.
టీడీపీ సమన్వయ కమిటీ ఇదే :
1. కింజరాపు అచ్చెన్నాయుడు
2. యనమల రామకృష్ణుడు
3. పయ్యావుల కేశవ్
4. పితాని సత్యనారాయణ
5. తంగిరాల సౌమ్య