ఈసారి జరిగే ఎన్నికలు అంత ఈజీగా వుండవని, తాము కూడా గట్టిగానే పోరాడుతామన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. 2024 ఎన్నికల్లో ఒంగోలు బరిలో మాగుంట వుంటారో, ఆయన కుమారుడు వుంటారో శ్రీనివాసులు రెడ్డి ఇష్టమన్నారు.
2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం నగరంలో జరిగిన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బర్త్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం బాలినేని మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా ప్రజలంతా మాగుంట కుటుంబానికి అండగా నిలబడాలన్నారు. ఏ సమస్య వచ్చినా మాగుంట మౌనంగా వుంటూ ఈజీగా తీసుకుంటున్నారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈసారి జరిగే ఎన్నికలు అంత ఈజీగా వుండవని, తాము కూడా గట్టిగానే పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో ఒంగోలు బరిలో మాగుంట వుంటారో, ఆయన కుమారుడు వుంటారో శ్రీనివాసులు రెడ్డి ఇష్టమన్నారు. ఈసారి కూడా ఆయనకు మెజారిటీ తగ్గకుండా చూడాలని బాలినేని ప్రజలను కోరారు. రాజకీయాల కోసం మాగుంట కుటుంబం వారి సొంత డబ్బు ఖర్చు చేస్తోందన్నారు. అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడుతూ.. గత రెండేళ్లు తమ కుటుంబానికి ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో పుట్టినరోజు జరుపుకోలేకపోయానని చెప్పారు. తమ కుటుంబం ఎన్నడూ ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదని.. తమన కుమారుడు రాఘవ రెడ్డి కూడా చాలా ఇబ్బందులు పడ్డారని మాగుంట ఆవేదన వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రజలు, నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.