సీఎం జగన్ ఆస్తుల కేసు...తెలంగాణ హైకోర్టులో విజయసాయికి చుక్కెదురు

By Arun Kumar PFirst Published Aug 11, 2021, 10:13 AM IST
Highlights

జగన్ ఆస్తుల కేసులో విచారణపై సిబిఐ కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన  వైసిపి ఎంపి విజయసాయి రెడ్డికి చుక్కెదురయ్యింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది.  సీఎం జగన్‌ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ముందుగా ఈడీ కేసులను విచారిచాలన్న సీబీఐ  కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో విజయసాయి పిటిషన్‌ దాఖలుచేసిన విషయం  తెలిసిందే.  మొదట సీబీఐ లేదంటూ రెండూ సమాంతరంగా విచారణ జరపాలని సిబిఐ కోర్టును ఆదేశించాలని విజయసాయి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ విజయసాయి వాదనను తోసిపుచ్చి ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు.  

ఇక ఇప్పటికే సీఎం జగన్ కూడా సిబిఐ కేసుల విచారణ ముగిసిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు నిరాకరించింది. డిశ్చార్జీ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించాలన్న జగన్ విజ్ఞప్తిని నిరాకరించిన కోర్టు వాటిని వేర్వేరుగానే వినాలని నిర్ణయించింది. 

read more  జగన్ ఆశయసాధన కోసమే.. బెయిల్ రద్దు కావాలని ప్రార్థిద్ధాం... : రఘురామ

ఇదిలావుంటే ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ తోటి ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని విజయ్ సాయిరెడ్డిని ఆదేశించింది న్యాయస్థానం. కౌంటర్ దాఖలుకు గడువు కోరడంతో విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది సిబిఐ కోర్టు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో రెండో నిందితుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఇప్పటికే సిబిఐ కోర్టు నోటీసులు జారీచేసింది. విజయసాయి రెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. 

 విజయసాయి రెడ్డి బెయిలును రద్దు చేయాలని దాఖలైన ఆ పిటిషన్ పై రెండురోజుల క్రితమే విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. నిన్న మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సిబిఐ కోర్టు కౌంటర్ దాఖలు సమయం కోరడంతో మరో మూడురోజుల సమయమిచ్చింది. విచారణను 13కి వాయిదా వేసింది. 

సిబిఐ కేసుల్లో సాక్షులుగా ఉన్నవారిలో విజయసాయి రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా భయాందోళనలు కలిగిస్తూ ప్రభావితం చేస్తున్నారని రఘురామ కృష్ణం రాజు ఆరోపించారు. విచారణకు సహకరిస్తామని చెప్పి కూడా ఏడాదిగా కోర్టు విచారణకు హాజరు కావడం లేదని, బెయిలు షరతులను ఉల్లంఘించారని రఘురామ కృష్ణం రాజు తన పిటిషన్ లో ఆరోపించారు. 

తనపై నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి కీలకమైన పదవులను ఇచ్చే విధంగా జగన్ ను ప్రభావితం చేశారని, దాంతో సాక్షులను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని అన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంటూ ప్రతివాదిగా ఉన్న విజయ సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది.

click me!