తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: చంద్రబాబుకు జీవన్మరణ సమస్య

By pratap reddyFirst Published 20, Nov 2018, 12:48 PM IST
Highlights

బిజెపితో తెగదెంపులు చేసుకున్న తర్వాత చంద్రబాబు వ్యూహం పూర్తిగా మారిపోయింది. తనకన్నా జూనియర్ అయిన రాహుల్ గాంధీని కలిసి స్నేహహస్తం అందించారు. తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెసుతో జత కట్టడానికి సిద్ధపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి జీవన్మరణ సమస్య. ఈ మాటంటే ఆశ్చర్యం కలగవచ్చు గానీ అది నిజం. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

ఆ విషయం తెలుసు కాబట్టే కాంగ్రెసుతో సీట్ల పంపకం విషయంలో తెలంగాణలో చంద్రబాబు తన నేతలను త్యాగాలకు సిద్ధం చేశారు. కేవలం 14 సీట్లకు అంగీకరించి, ఆ తర్వాత ఓ సీటును తగ్గించుకున్నారు కూడా. దీన్నిబట్టి చంద్రబాబు ఆలోచన, వ్యూహం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 

బిజెపితో తెగదెంపులు చేసుకున్న తర్వాత చంద్రబాబు వ్యూహం పూర్తిగా మారిపోయింది. తనకన్నా జూనియర్ అయిన రాహుల్ గాంధీని కలిసి స్నేహహస్తం అందించారు. తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెసుతో జత కట్టడానికి సిద్ధపడ్డారు. వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసుతో చెలిమి ఉంటుందనే అందరూ భావిస్తున్నారు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధించకుండా, కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తే చంద్రబాబు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో దాని ప్రభావం పడుతుంది. తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఎపిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. 

బిజెపిని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను లక్ష్యం చేసుకుని ఆయన చేస్తున్న సమరం వల్ల చంద్రబాబును కేసులు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉంది. తాను తిరిగి విజయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు వచ్చేలోగా కేసీఆర్ చంద్రబాబును లక్ష్యం చేసుకుని వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసును, ఇతర కేసులను ఆయన తిరిగి తోడే ప్రమాదం ఉంది. ఇప్పుడు చంద్రబాబు తీవ్రమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి అస్త్రాలను సంధివచ్చు.

రాజకీయంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేసీఆర్ వేలు పెట్టే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును ఓడదించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వీరిద్దరు విడివిడిగా పోటీ చేస్తే చంద్రబాబు కాంగ్రెసు సాయంతో గట్టెక్కే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే, చంద్రబాబును కచ్చితంగా ఓడించడానికి అవసరమైన వ్యూహరచనను కేసిఆర్ చేసి అమలు చేసే అవకాశాలు లేకపోలేదు.

జగన్మోహన్ రెడ్డికి, పవన్ కల్యాణ్ కు మధ్య సయోధ్య కుదిర్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వారిద్దరిని పొత్తుకు అంగీకరింపజేసేందుకు కేసిఆర్ చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అదే జరిగితే చంద్రబాబు ఓటమి ఖాయమవుతుంది. ఈ రకంగా చూస్తే తెలంగాణ కేసిఆర్ ఓడించడం కాంగ్రెసు పార్టీ కన్నా చంద్రబాబుకే ఎక్కువ అవసరంగా కనిపిస్తోంది. 

Last Updated 20, Nov 2018, 12:48 PM IST