సీఎం కూతుళ్లపై ఇలాంటి దారుణమే జరిగితే... డబ్బులతోనే న్యాయంచేస్తారా?: టిడిపి అనిత సంచలనం

By Arun Kumar PFirst Published Sep 15, 2021, 5:19 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ డిజిపి ఇంట్లోనో, సీఎం,హోంమంత్రి  కూతుళ్లపైనే దారుణాలు జరిగితే ఇలాగే న్యాయం చేస్తారా అంటూ పోలీసులను, ప్రభుత్వాన్ని నిలదీశారు టిడిపి నాయకురాలు వంగలపూడి అనిత. 

అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాన్ని ప్రతిఒక్కరూ నవ్యాంధ్రప్రదేశ్ అని పిలిస్తే... 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అత్యాచారాంధ్రప్రదేశ్ అని పిలుస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ నివేదిక ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్సీఆర్బీ నివేదికలో అత్యాచారాలు, ఆడబిడ్డలపై జరిగే అఘాయిత్యాలు, మానవ అక్రమ రవాణాలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండటం బాధాకరమని అనిత అన్నారు.  ఃఃః

''ఇంత గొప్ప ఘనత సాధించినందుకు వైసీపీ నాయకలు, ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఆనందపడతారేమో గానీ... ప్రజా ప్రతినిధులుగా, సాటి ఆడబిడ్డలుగా తాముమాత్రం సిగ్గుపడుతున్నాం. ఆడబిడ్డలను అక్రమ రవాణా చేయడం, వారిని వ్యభిచార కూపాలకు పంపడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నిస్తున్నాం. ఎక్కడో ఏదో జరిగితే దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి రాజకీయాలు చేస్తున్నారని కొందరు మేధావులు అంటుంటారు. కానీ ఏదో ఒకటో రెండో ఘటనలైతే ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందిలే అనుకోవచ్చు. కానీ నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకమూలన చిన్నారులు మొదలు వృద్ధులవరకు ఆడబిడ్డలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి'' అని అనిత ఆందోళన వ్యక్తం చేశారు. 

''ఏం జరిగినా, ఎన్ని జరిగినా ప్రభుత్వం, ముఖ్యమంత్రితో పాటు ఆడబిడ్డైన హోంమంత్రి కూడా దిశా చట్టం ఉందని... అదే న్యాయం చేస్తుందని చెబుతున్నారు. ఒక ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి, పోలీసులు ఎందుకు వెంటనే చర్యలు తీసుకొని నిందితులను శిక్షించలేకపోతున్నారు? డీజీపీ ఇంట్లోనో, హోంమంత్రి కూతురికో, ముఖ్యమంత్రి బిడ్డకో ఏదైనా జరిగితే ఇలానే స్పందిస్తారా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''రాష్ట్రంలో ఆడ పిల్లలను, మహిళలను ఒంటరిగా బయటకు పంపే పరిస్థితులు లేనేలేవు. ఆఖరికి చిన్న పిల్లాడిని అయినా తోడు పంపాల్సిన దుస్థితి నెలకొంది. ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచీ తల్లిదండ్రుల సహాయసహకారాలతో, తరువాత భర్త, బిడ్డల సహాయంతో బతుకుతూ ఉంటుంది. కానీ రాష్ట్రంలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. ఆడబిడ్డ లేదా మహిళ పక్కన భర్త ఉన్నా, తండ్రిఉన్నా, ఆఖరికి బిడ్డలున్నా కూడా కాపాడలేని విధంగా ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తయారుచేశాడు. ఆఖరికి ముక్కు పచ్చలారని చిన్నపిల్లలకు కూడా రాష్ట్రంలో రక్షణలేకుండా పోయింది. ఇటువంటి దారుణాన్ని ప్రభుత్వ పెద్దలు, సలహాదారులు నిస్సిగ్గుగా ఎలా సమర్థిస్తారు? రమ్య తల్లిదండ్రులను పిలిపించి వారికేదో చేసేశామని చెబితే మహిళలను కాపాడినట్టేనా? జగన్మోహన్ రెడ్డి అసమర్థతతో రాష్ట్రం అత్యాచారాంధ్రప్రదేశ్ గా తయారైంది'' అని మండిపడ్డారు. 

read more  ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారులను మిద్దె మీదికి తీసుకెళ్లి.. కీచకుడి వికృతం.. అరెస్ట్..

''ముక్కుపచ్చలారని చిన్నారి మొదలు ముదుసలి వరకు రాష్ట్రంలో ఎవరికీ రక్షణలేదు. పక్కన తండ్రి, అన్నదమ్ములు, బిడ్డలున్నాకూడా మహిళలు మృగాళ్ల దారుణాలకు బలవుతున్నారు. అందుకు కారణం ఈ ప్రభుత్వ, ముఖ్యమంత్రి చేతగానితనం, అసమర్థత కాదా?  దిశాచట్టం పచ్చి బూటకమని అందరికీ అర్థమైంది. ఇక ప్రభుత్వం ఆడబిడ్డలను, మహిళలను ఎలా రక్షిస్తుందో సమాధానం చెప్పాలి.  రాష్ట్రంలో ఆడబిడ్డలపై దారుణాలు జరుగుతుంటే ఆడబిడ్డ తండ్రి జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు చలనంలేదు?  డీజీపీ కూతురికో, హోంమంత్రి కూతురికో ఏదైనా జరిగితే రూ.10లక్షల డబ్బులు, 5సెంట్ల ఇల్లు తీసుకొని సరిపెట్టుకుంటారా?  న్యాయం వేరు, సాయం వేరనే పచ్చినిజాన్ని ప్రభుత్వ పెద్దలు, హోంమంత్రి, డీజీపీ, ముఖ్యమంత్రి ఎందుకు విస్మరిస్తున్నారు?'' అంటూ ప్రశ్నించారు. 

''ఏదో ఒకరోజు ఒక ఘటన కాదు... నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకమూల మహిళలు, యువతులు ఘోరాలకు బలవుతున్నారు.  మృగాళ్ల దురాగతాలను ప్రభుత్వ పెద్దలు, సలహాదారులు, ఆఖరికి హోంమంత్రి సమర్థించుకోవడం సిగ్గుచేటు. మేడికొండూరు అత్యాచార ఘటనలో నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారన్న విలేకరుల ప్రశ్నకు బాధితురాలు నిందితులను గుర్తించడంలో విఫలమైందని హోంమంత్రి చెప్పడంకంటే సిగ్గుచేటు మరోటి ఉంటుందా? కనీసం బాధితురాలిని పరామర్శించడానికి కూడా హోంమంత్రికి తీరికలేదు. ఎందుకు పరామర్శించలేదన్న మీడియావారిపై హోంమంత్రి ఎందుకంతలా అసహనం వ్యక్తం చేశారు?'' అని అడిగారు.

''ఇద్దరు మైనర్ బాలికలపై తండ్రీ కొడుకులు అత్యాచారయత్నం చేస్తే వారినేం చేశారు? నెల్లూరు జిల్లాలో చేస్తున్న తప్పుని వీడియోతీసి మరీ బరితెగించారటే అది ఈ ప్రభుత్వ వైఫల్యంకాదా?  వాలంటీర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆడపిల్లలపై దారుణాలకు తెగబడినప్పుడే ముఖ్యమంత్రి స్పందించలేదు.  స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు రాసలీలలు బయటకొచ్చినా హోంమంత్రి చర్యలు తీసుకోరు.  ఈ వ్యవస్థ, ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇలా ఉంటే ఇక సామాన్యులకు, మహిళలకు రాష్ట్రంలో రక్షణ ఉందంటే ఎవరైనా నమ్ముతారా?'' అని నిలదీశారు

''రాష్ట్ర డీజీపీ ఏనాడైనా మహిళలు, యువతుల భద్రతపై సమీక్ష చేశారా? ఇంచుమించు 520వరకు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరిగితే ఆడబిడ్డల రక్షణకోసం డీజీపీ ఏనాడైనా మహిళా సంఘాలతో కలిసి సమీక్షలు చేశారా? అఘాయిత్యాలకు గురైన ఆడబిడ్డలను పరామర్శించడానికి వెళుతున్న టీడీపీవారిని మాత్రం డీజీపీ సమర్థంగా అడ్డుకుంటున్నాడు. డీజీపీ వైసీపీకి తొత్తుగా మారి, టీడీపీ వారిపై అక్రమ కేసులు ఎలా పెట్టాలన్న దానిపైనే ఆలోచిస్తున్నారు తప్ప ఆడబిడ్డలు, మహిళల రక్షణ గురించి ఆలోచించడం లేదు. పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని టీడీపీ వారిని అడ్డుకోవడంపై కాక, ఆడబిడ్డల రక్షణకోసం వినియోగిస్తేమంచిదని సూచిస్తున్నాం. పోలీస్ బలగాలతో ప్రతిపక్షాన్ని, డీజీపీ అడ్డుకోగలరేమో కానీ ఆడబిడ్డల తల్లిదండ్రులను, వారి ఆగ్రహావేశాలను అడ్డుకోలేరు'' అని వంగలపూడి అనిత హెచ్చరించారు.

click me!