
Rajya Sabha: 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ చూడని ఓ ఘోర పరాభవాన్ని ఆ పార్టీ ఇప్పుడు ఎదుర్కోబోతున్నది. 1983 నుంచి ఇప్పటి వరకు రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం ఉన్నది. కానీ, ఇప్పుడు ఉన్న ఒక్క రాజ్యసభ ఎంపీ పదవి కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. తాజాగా జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశాలు లేవు. దీంతో రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోనున్నది.
టీడీపీ ఏకైక రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. కానీ, ఇప్పుడు జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక్క సీటును కూడా గెలుచుకునే స్థాయిలో టీడీపీకి ఎమ్మెల్యేల సంఖ్య లేదు.
2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు, టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే, ఇప్పుడు ఒక్క రాజ్యసభ సీటును గెలుచుకోవాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఈ లెక్కన టీడీపీకి కొత్తగా రాజ్యసభ సీటు దక్కడం కష్టమే. ఈ రాజ్యసభ ఎన్నికలు ఏపీలో ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్నాయి.
Also Read: Evil: ఏపీలోని ఆ గ్రామంలో భయానక అదృశ్య శక్తి? తెల్లార్లు మెలకువతోనే యువత కాపలా.. అసలేం జరుగుతున్నది?
అయితే, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ టీడీపీకి కొన్ని ఆశలు లేకపోలేవు. వైసీపీ అసంతృప్తులు, టికెట్ ఆశించి భంగపడ్డవారు పెద్ద ఎత్తున తమకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.