Evil: ఏపీలోని ఆ గ్రామంలో భయానక అదృశ్య శక్తి? తెల్లార్లు మెలకువతోనే యువత కాపలా.. అసలేం జరుగుతున్నది?

By Mahesh KFirst Published Feb 12, 2024, 12:36 AM IST
Highlights

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని కాండ్రకోట గ్రామం ఇప్పుడు భయంతో చిగురుటాకులా వణికిపోతున్నది. ఓ భయానక అదృశ్య శక్తి గ్రామంలో కలియ తిరుగుతున్నదని, ఎప్పుడు ఏ ముప్పు తలపెడుతుందోనని గ్రామస్తులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వారు రాత్రిళ్లు నిద్రపోవడం మానేసి కర్రలతో ఇంటి ముందు కాపలా కాస్తున్నారు.
 

Evil Spirit: ఆంధ్రప్రదేవ్ కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలానికి చెందిన కాండ్రకోట గ్రామం ఇప్పుడు వణికిపోతున్నది. ఓ అదృశ్య శక్తి తమ ఊరిలో తిరుగుతున్నదని, ఎవరికి ఏ ముప్పు ఎప్పుడు తలపెడుతుందోనని గ్రామస్తులు భయకంపితులవుతున్నారు. గత రెండు మూడు వారాలుగా ఈ గ్రామస్తులు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. చిన్నపిల్లలు మినహా ఆడ, మగ, ముసలి అనే తేడా లేకుండా అంతా చీకటి పడగానే జాగ్రత్తగా ఉంటున్నారు. అంతా కర్రలు పట్టుకుని మెలకువతోనే గడుపుతున్నారు.

కాండ్రకోట గ్రామంలో మెజార్టీ ప్రజలు వ్యవసాయదారులే. నీటి సాగు కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా పొలాల వద్దకు వెళ్లి వస్తుంటారు. దాదాపుగా రాత్రంతా కూడా అక్కడ ఏదో ఒక అలికిడి ఉంటూనే ఉండేది. ఎవరో ఏదో పనుల మీద వెళ్లుతుండేవారు. కానీ, ఇప్పుడు ఆ ఊరు రాత్రయితే చాలు భయంలో కూరుకుపోతున్నది. రాత్రి ఏడు గంటల తర్వాత వాకిలి దాటడం లేదు. పనులన్నీ వాయిదా వేసుకున్నారు. తెల్లారి సూర్యకాంతి పడే వరకు ఇల్లు వదలడం లేదు. అసలేం జరిగింది? ఎందుకీ భయం?

ఫిబ్రవరి రెండో వారంలో ఓ ఉదయం గ్రామస్తులు కలకలానికి గురయ్యారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయ, ఎండు మిర్చితో భూతపూజ చేసిన ఆనవాళ్లు వారికి కనిపించాయి. ఆ తర్వాత ఓ మేకను బలి ఇచ్చి ఓ ఇంటి సమీపంలో తిన్నట్టుగా గుర్తులు కనిపించాయి. అంతకు కొన్ని రోజుల క్రితమే ఊరి శివారుల్లోని పొలాల నుంచి నగ్నంగా ఇద్దరు వ్యక్తులు (పురుషులు) పారిపోతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ ఊరిలో భయానక వాతావరణం మొదలైంది. తమకు వింత శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయని, గతంలో ఇలాంటి శబ్దాలెన్నడూ వినలేదని ఊరి పెద్దలు చెబుతున్నారు. 

Also Read: YS Sharmila: ఎంత మంది వస్తారో రండి.. చూసుకుందాం.. : నగరిలో షర్మిల సవాల్

రాత్రి అయితే చాలు భయంతో వణికిపోతున్నామని, ఎప్పుడు ఏ దుష్టశక్తి పూనుకుంటుందో అని రోజులు లెక్కిస్తున్నామని వివరిస్తున్నారు. అందుకే ఊరిలోని నూకాలమ్మ ఆలయంలో అష్ట భైరవ మహాశక్తి హోమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. అయినా.. అరుపులు వినపడుతూనే ఉన్నాయని అంటున్నారు. అందుకే మరో హోమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు.

రాత్రిళ్లు యువకులు, పెద్దలు కర్రలు పట్టుకుని మెలకువతోనే ఉంటున్నారు. కొన్ని రోజులుగా వారు రాత్రిళ్లు నిద్ర మానేశారని చెబుతున్నారు.

ఆ ‘దెయ్యాన్ని’ చూశానని కచ్చితంగా ఎవరూ చెప్పకపోయినా.. కొందరు ముక్కలు ముక్కలుగా కొన్ని విషయాలు చెబుతున్నారు. నల్లటి రూపంలో పొడవైన జుట్టుతో పెద్ద కాళ్ల మడమలతో నగ్నంగా ఓ భూతం కనిపించిందని, అది ఓ చెట్టు మీది నుంచి దూకి అదృశ్యమైందని ఓ గ్రామస్తుడు చెప్పాడు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. శివాలయం వద్ద లంకె బిందెలు ఉన్నాయని, కొందరు నమ్ముతున్నారని, ఇందుకోసమే ఈ భయాన్ని వ్యాపింపజేస్తున్నారని కొందరు అనుమానిస్తున్నారు. కాగా, పిల్లల కోసం గాబరా పడుతున్న ఇళ్లు పరిసరాల్లో ఆ అదృశ్య శక్తి తిరుగుతున్నదని ఇంకొందరు గ్రామస్తులు వివరిస్తున్నారు.

ఇదిలా ఉండగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అలాంటి నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ ఊరిలో ఓ పోలీసు పికెట్ కూడా ఏర్పాటు చేశారు.

click me!