
ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవటం చూసాం, విన్నాం. కానీ నంద్యాలలో జరిగిందేమిటో తెలుసా? ప్రభుత్వమే వేలాది ఓట్లను కొనుగోలు చేసి టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించింది. ప్రభుత్వం ఓట్లను కొనుగోలు చేయటమేంటని అనుమానంగా ఉందా? అదేనండి, రాష్ట్రం మొత్తం మీద డ్వాక్రా సంఘాలున్నట్లే నంద్యాలలో కూడా ఉన్నారు కదా? నియోజకవర్గంలో సుమారు 13 వేల మంది డ్వాక్రా మహిళులున్నారట. వారందరికీ తలా రూ. 4 వేలు ఎన్నికల సమయంలో అంటే పోలింగ్ కు ముందు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమైందట.
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు తీర్చటంలో తప్పేంటనే సందేహం వస్తోందా? ఇక్కడే అసలు కథంతా ఉంది. ఏంటంటే, 2015-16లో డ్వాక్రా మహిళలకు తలా రూ. 3 వేలు వేసింది. అదేవిధంగా 2016-17లో కూడా వేసింది. అయితే, 2017-18లో మాత్రం రాష్టంలో ఎక్కడ కూడా ఒక్కరూపాయి జమచేయలేదు. అటువంటిది ఒక్క నంద్యాలలో మాత్రమే డ్వాక్రా గ్రూపులకు ప్రభుత్వం ఎందుకు జమచేసింది? అంటే అక్కడ ఉపఎన్నిక జరుగుతోంది కాబట్టి, అక్కడ టిడిపి గెలవాలికాబట్టి.
అందుకే కేవలం నంద్యాలలో మాత్రమే డ్వాక్రా మహిళల ఖాతాలకు నేరుగా ప్రభుత్వం నుండి డబ్బులు అందాయి. అంటే టిడిపి అభ్యర్ధికి ఓట్లు వేయాలన్న షరుతుపైనే ప్రభుత్వం డ్వాక్రా గ్రూపుల్లోని మహిళల ఖాతాలకు నేరుగా డబ్బులు జమచేసిందన్న విషయం అర్దమైపోతోంది. అభ్యర్ధి తరపున ఎవరైనా డబ్బులు పంచితే అది అవినీతి క్రిందకు వస్తుంది. పైగా ఎన్నికల నిబంధనలను అతిక్రమించినట్లవుతుంది. పట్టుకుంటే అదో తలనొప్పి. అదే అభ్యర్ధి తరపున నేరుగా ప్రభుత్వమే పంచితే దాన్నేమంటారు? పట్టుకునేదెవరు? రాజమండ్రి పార్లమెంటు మాజీసభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ విప్పిన గుట్టేంటో మీరూ చూడూండి....