
ఫిరాయింపు ఎంఎల్ఏలకు జనాలు షాకులిస్తున్నారు. ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమం మొదలైన దగ్గర నుండి షాకులు మరీ ఎక్కువగా తగులుతున్నాయి. కార్యక్రమంలో నలుగురు ఎంఎల్ఏలను జనాలు నిలదీయటంతో వారికి ఏం సమాధానాలు చెప్పాలో అర్దం కాలేదు. దాంతో కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగారంటేనే అర్ధం చేసుకోవచ్చు పరిస్ధితి. జ్యోతుల నెహ్రూ, చాంద్ భాషా, జయరాములు, అశోక్ రెడ్డిలకు జనాలు చుక్కులు చూపించారు. ‘‘వైసీపీ తరపున గెలిచి వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓట్లు వేయాలని ఎలా చెబుతున్నారంటూ’’ జనాలు నిలదీస్తున్నారు.
వైసీపీ తరపున పోయిన ఎన్నికల్లో గెలిచిన ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించి తాజాగా జనాల్లోకి వస్తుండటంతో సెగ బాగా తగులుతోంది. ఎందుకంటే ఇంతకాలం ఎంఎల్ఏలకే జనాల్లోకి వెళ్ళాల్సిన అవసరం టిడిపి ఎంఎల్ఏలకే పెద్దగా రాలేదు. కాబట్టి ఫిరాయింపులు దాదాపు జనాల్లోకి వెళ్ళలేదు. అటువంటిది పార్టీ కార్యక్రమం పేరుతో ఒక్కసారిగా ఇన్ని రోజులు జనాల్లో తిరగాల్సిన అగత్యం ఏర్పడింది అందరికీ. దాంతో మంత్రులకే కాదు ఫిరాయింపులకు కూడా గట్టిగానే షాకులు తగులుతున్నాయ్.
వైసీపీ నుండి టిడిపిలోకి ఎందుకు ఫిరాయించారంటూ పై నలుగురు ఎంఎల్ఏలను జనాలు గట్టిగా నిలదీస్తున్నారు. సరే, జనాలంటే ఇందులో వైసీపీ వాళ్ళూ ఉంటారనుకోండి అదివేరే సంగతి. జనాలు నిలదీస్తారన్న భయంతోనే ఫిరాయింపులు పెద్దగా జనాల్లోకి తిరగటం లేదు. కానీ ఇపుడు తప్పలేదు. దాంతో షాకులు తినాల్సి వస్తోంది.