
NDA: చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ త్వరలోనే ఎన్డీయే కూటమిలో చేరనుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో తెలుగు దేశం పార్టీ చేరడం దాదాపు ఖాయం అయింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల కేటాయింపులపై చర్చ మాత్రమే మిగిలి ఉన్నది. ఈ సీట్ల కేటాయింపులపైనా చర్చలు వేగం అందుకున్నాయి. టీడీపీ సారథ్యంలో ఈ కూటమి ఏపీలో ఎన్నికల బరిలోకి దిగితే.. 2014లో మాదిరిగానే ఈ సారి కూడా బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకోగలమనే ఆశలో ఉన్నది.
టీడీపీ వర్గాల ప్రకారం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 30 నుంచి 35 అసెంబ్లీ సీట్ల వరకు జనసేన పార్టీ, బీజేపీకి టీడీపీ ఇవ్వవచ్చు. అలాగే.. ఏడు నుంచి ఎనిమిది లోక్ సభ సీట్లు జనసేన, బీజేపీలకు ఇచ్చి 17 నుంచి 18 సీట్లల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తున్నది. ఫిబ్రవరి చివరికల్లా ఈ అంశాలు అన్నింటిపై స్పష్టత రానుంది.
బీజేపీ తమను వెయిటింగ్ మోడ్‌లో పెట్టిందని ఓ టీడీపీ నేత చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని మరచిపోరాదని, అందుకే బీజేపీ కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నదని పేర్కొన్నారు. కానీ, పొత్తు మాత్రం కన్ఫామ్ అన్నట్టుగా ఆయన తెలిపారు.
Also Read: Virushka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క, విరాట్ కోహ్లీ దంపతులు.. పేరు కూడా పెట్టారుగా..
కాగా, ఏపీకి చెందిన ఓ బీజేపీ నాయకుడు మరో విషయాన్ని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ సీట్లను పెంచుకోవాలని అనుకుంటున్నది. కాబట్టి, ఇక్కడ టీడీపీ నుంచి ఎక్కువ సీట్లను పొందాలని బీజేపీ భావిస్తున్నది. అయితే.. ఆ మేరకు టీడీపీ కూడా బీజేపీకి కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే 2014లో బీజేపీ, టీడీపీలు పొత్తులో జనసేన మద్దతులో పోటీ చేయగా.. మంచి ఫలితాలను చూశారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. ఎంపీ సీట్లు కూడా ఎక్కువ వచ్చాయి. అదే.. 2019లో వేటికవిగా పోటీ చేస్తే తీవ్రంగా నష్టపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితం కాగా.. జనసేన ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.