ముగ్గురూ ముగ్గురే: అంతర్గత కుమ్ములాటలతో టీడీపీ ఆందోళన

By pratap reddyFirst Published Aug 13, 2018, 11:56 AM IST
Highlights


విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నేతలు ఎవరికి వారే ఆధిపత్యం కోసం పాకులాడటంతో టీడీపీ గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటుంది.

విజయనగరం: 


విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నేతలు ఎవరికి వారే ఆధిపత్యం కోసం పాకులాడటంతో టీడీపీ గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటుంది. ఒకప్పుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ కేంద్రమంత్రి ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు కనుసన్నుల్లో నడిచే తెలుగుదేశం పార్టీ  ఆయన స్థబ్ధుగా ఉండటంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మెుదలయ్యాయి. 

రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగరావు ఒక వర్గంగా....జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు మరో వర్గంగా.....ఎంపీ అశోక్ గజపతిరాజు వర్గీయులు మరో వర్గంగా విడిపోవడంతో జిల్లాలో సైకిల్ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. జిల్లా రాజకీయాల్లో పూసపాటి అశోక్ గజపతిరాజుకు, బొబ్బిలి రాజవంశీయులైన సుజయ్ కృష్ణ రంగరావులకు ఎప్పుడూ పొసగదు. 

బొబ్బిలి యుద్ధం నాటి నుంచి పూసపాటి రాజవంశీయులు, బొబ్బిలి రాజవంశీయులు ఉప్పునిప్పులా ఉంటారు. ఎంపీ అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటే.....సుజయ్ కృష్ణ రంగరావు మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండగా అప్పటి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో పొసగకపోవడం....వైఎస్ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాలు... వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడంతో సుజయ్ కృష్ణ రంగరావు హస్తానికి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు. 

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమకంటూ ఓ గుర్తింపుతో  ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దూసుకుపోతున్న తరుణంలో  బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మింగుడుపడలేదు. బొత్స సత్యనారాయణ రాకను వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పావులు కదిపారు. అయితే సుజయ్ కృష్ణ రంగరావును పార్టీలోకి తీసుకోవడంపై ఎంపీ అశోక్ గజపతిరాజు వ్యతిరేకించారు. అయితే  టీడీపీ మాత్రం సుజయ్ కృష్ణ రంగరావును టీడీపీలోకి స్వాగతించడం ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో భూగర్భగనుల శాఖ మంత్రిగా కేటాయించడంతో అశోక్ గజపతిరాజు అలక వహించారు. పార్టీ ఆదేశాల మేరకు పైకి కలుపుకుపోతున్నా లోలోన మాత్రం అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 


అటు ఇంచార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించేందుకు రాజకీయాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిలను తనవైపుకు తిప్పుకుని వర్గరాజకీయాలు చేస్తున్నారు. 

గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక విషయంలో వర్గపోరు బట్టబయలవడంతో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగడం....టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు నేతృత్వంలో అమరావతిలో సమావేశం నిర్వహించి పార్టీలో ఎలాంటి విభేదాలు లేవంటూ సంకేతాలివ్వడంతో అప్పట్లో వర్గపోరు సద్దుమణిగింది. 

తాజాగా పీఎసీఎస్ లేదా నియోజకవర్గ స్థాయిలో రైతు రుణాల విషయంలో టీడీపీ నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. మంత్రులు సైతం తమ వర్గం నేతలకే ఇవ్వాలంటూ పట్టుబట్టడం లేదంటే అస్సలు పట్టించుకోకపోవడంతో తెలుగు తమ్ముళ్లు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 

ఇప్పటికే వర్గాలుగా విడిపోయిన నేతలకు తాము ఎవరిని పలుకరిస్తే ఎ వర్గానికి అంటకట్టి దూరం పెడతారోనని అంతర్మధనం చెందుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దిశానిర్దేశం చెయ్యాల్సిన నేతలు వర్గపోరును ప్రోత్సహించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

click me!