
గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహంపై జరిగిన దాడి వివాదంగా మారుతోంది. దివంగత సీఎం విగ్రహంపై ఇలా దాడి జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ దాడిని ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు. అలాగే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా మాట్లాడారు. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. టీపీడీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ విషయంలో స్పందించారు. వైకాపా కార్యకర్త ధ్వంసం చేయడాన్ని తప్పుబట్టారు. మద్యం మత్తులో చేసిన పనికాదనీ, కావాలనే ఉద్దేశప్వూరంగా చేసిన దాడి అని ఆరోపించారు.
ప్రధానితో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ: కీలకాంశాలపై చర్చ
ఈ ఘటనపై టీడీపీ నుంచే కాకుండా అధికార వైసీపీ నుంచి కూడా వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఇదే విషయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఆదివారం దుర్గిలో జరిగిన ఘటనను పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని అభివర్ణించారు. ఎన్టీఆర్ అంటే అందరికీ గౌరవమే అని తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించారని తెలిపారు. అందుకే ప్రజలు ఆ మహనీయుల గౌరవార్థం విగ్రహాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు.
దుర్గి ఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ప్రభువ్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడని ఆరోపించారు. ఎన్టీఆర్‌ను మానసికంగా కుంగదీశారని, ఆయన మృతికి చంద్రబాబు నాయుడే కారణమని ప్రభుత్వ విప్ విమర్శించారు. అయితే దుర్గిలో జరిగిన చిన్న ఘటనను టీడీపీ రాజకీయం చేస్తోందని తెలిపారు. ఈ ఘటనకు వైసీపీకీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన అని చెప్పారు.
ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. రైతులు ఖాతాల్లోకి రూ. 1036 కోట్లు జమ.. నిధులు విడుదల చేసిన సీఎం జగన్
కొత్తగా మాచర్ల నియోజకవర్గానికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వ్యక్తిని ఇన్‌చార్జీగా నియమించారని, ఆయన నేపథ్యాన్ని ఉపయోగించుకొని ప్రజలను భయాలకు గురి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలించే విధంగా సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ చేసే అసత్య ప్రచారాన్ని ఏపీ ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు. దుర్గి ఘటనను వైసీపీ పూర్తిగా ఖండిస్తోందని అన్నారు. తమ పార్టీ ఎప్పుడూ
ఇలాంటి ఘటనకు పాల్పడిన వారిని ప్రోత్సహించబోదని తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తిని అతడి తండ్రే పోలీసులకు అప్పగించారని గుర్తు చేశారు. పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనను ఆసరాగా తీసుకొని ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించాలని అనుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఆ పార్టీ రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.