
ప్రశ్నించేందుకే పుట్టిన జనసేన ఆ పనిని మాత్రం సమర్ధవంతంగా చేయలేకపోతోంది. తాజాగా అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో పవన్ మాట్లాడిన మాటల్లో ఆ విషయం స్పష్టమైంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రైన తర్వాత అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగుచూసింది. అంటే గడచిన రెండున్నరేళ్ళుగా ఈ కేసును ప్రభుత్వం నానబెడుతోందే కానీ పరిష్కారం దిశగా చర్యలు మాత్రం తీసుకోవటం లేదు. ప్రభుత్వంలోని పెద్దల్లో కొందరు సంస్ధ యాజమాన్యంతో కుమ్మకైనట్లు ఆరోపణలు వస్తుండటం గమనార్హం. పైగా పవన్ కన్నా ముందు మాట్లాడిన వారిలో అత్యధికులు ప్రభుత్వాన్నే తప్పుపట్టారు.
మొత్తం మీద కేసు విచారణ నత్తనడకను తలపిస్తోందన్నది వాస్తవం. శారదా స్కాం, ఒడిస్సాలో బయటపడిన స్కాం, సహారా స్కాంల్లో బాధితులకు తక్షణ ఊరట కల్పించేందుకు అక్కడ చర్యలు తీసుకున్నారని చెబుతూనే ఇక్కడ మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని పవన్ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు. పైగా సంస్ధ యాజమాన్యానికి ప్రభుత్వమే అవార్డులు ఇచ్చింది కాబట్టే తాము సంస్ధను నమ్మినట్లు బాధితులు, ఏజెంట్లు చెబుతుండటం గమనార్హం. బాధితులందరూ ప్రభుత్వాన్నే తప్పుపడుతున్నపుడు పవన్ కూడా ఆ దిశగానే మాట్లాడాలి కదా? మరెందుకు మొహమాట పడుతున్నట్లు?
పైగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంస్ధ భూములను చవకగా కొనుగోలు చేసినట్లు వైసీపీ ఆధారాలతో సహా బయటపెట్టింది. అసెంబ్లీలో ఈ విషయమై పెద్ద చర్చ కూడా జరిగింది. ఆ విషయంపైన కూడా పవన్ సూటిగా మాట్లాడలేకపోయారు. కుంభకోణం వెలుగుచూసి రెండున్నరేళ్ళైనా ఇప్పటి వరకూ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించాల్సిన పవన్ ఓ సూచన మాత్రం చేసి వదిలేసారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వానికి చెందాలే కానీ ప్రభుత్వంలోని వ్యక్తులకు కాదని పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించటం గమనార్హం. సంస్ధ భూములను ఇప్పటికే పలువురు పెద్దలు సొంతం చేసుకున్నారని వచ్చిన ఆరోపణలుపై నేరుగా స్పందించలేదు.
న్యాయస్ధానంతో మాట్లాడి సంస్ధ భూములను తక్షణమే వేలం వేసి బాధితులకు న్యాయం చేయమని కూడా పవన్ ప్రభుత్వానికి గట్టిగా చెప్పలేకపోయారు. బాధితులకు జరగాల్సిన మేర న్యాయం కూడా జరగలేదని ఏదో మొహమాటం కొద్ది అన్నట్లుంది. పైగా రాజకీయవ్యవస్ధ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని గాలిలో బాణం వేసారు. సమస్య పరిష్కారానికి వామపక్షాలు, జనసేన తరపున ఓ కమిటిని వేసారు. సమస్య పరిష్కారినికి తాను వామపక్షాలతో కలిసి పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మొత్తం మీద సమస్య పోరాటానికి తాను చేయబోతున్న పోరాటం ఏమిటో మాత్రం చెప్పలేదు. బాధితులకు ఊరటగా తనవంతుగా ఏం చేయబోతున్నారో కూడా చెప్పలేకపోయారు.