మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? అయినా కుటుంబ చరిత్ర అలాంటిది: పెద్దిరెడ్డిపై అనురాధ వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Feb 3, 2021, 4:14 PM IST

తులసివనం లాంటి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ  కలుపుమొక్క అని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు. 


విజయవాడ: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాను అన్ని విభాగాల్లో ప్రగతి పథంలో నడిపిస్తే... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గంజాయివనంగా మార్చేశారని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. తులసివనం లాంటి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి  కలుపుమొక్క అని విమర్శించారు. 

''అభివృద్ది గురించి మాట్లడే ధైర్యం, బడుగు బలహీన వర్గాలను రక్షించే దమ్ము పెద్దిరెడ్డికి లేదు. పెద్దిరెడ్డి నియంతృత్వ పోకడలతో జిల్లాలో రాక్షస పాలన చేస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఏం అభివృద్ది పనులు చేశారో శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం పెద్దిరెడ్డికి ఉందా? గత ప్రభుత్వంలో ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించిన నారా లోకేష్ అభివృద్ధిని పరుగులు పెట్టించారు. లోకేష్ 23 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయిస్తే..పెద్దిరెడ్డి తన గెస్ట్  హౌజ్ కు మాత్రమే రోడ్డు వేసుకున్నారు'' అని ఎద్దేవా చేశారు. 

Latest Videos

undefined

''టీడీపీ హయాంలో విద్యుత్ ఆదా చేసేందుకు ప్రతి గ్రామంలో 27 లక్షల ఎల్ ఈడీ బల్బులు తీసుకొస్తే వాటిని పర్యవేక్షించడం కూడా పెద్దిరెడ్డికి చేతకాలేదు. టీడీపీ ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టిలో భాగంగా 7 వేలకు పైగా గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టింది. దాని గురించి మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. టీడీపీ హయాంలో నిర్మించిన పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులేస్తారా? టీడీపీ ప్రభుత్వం 6 లక్షలకు పైగా పంటకుంటలు నిర్మిస్తే ఈ ప్రభుత్వం ఒక్క కుంట అయినా తవ్విందా? ఎంతసేపూ దాడులపైనే దృష్టి'' అని విమర్శించారు. 

read more   ఏపీ హైకోర్టు సంచలన తీర్పు: టిడ్కో ఇళ్లపై పిటిషన్ కొట్టివేత

''పెద్దిరెడ్డికి మహిళలంటే చిన్నచూపు. చిత్తూరు జిల్లాలోని మహిళలకు రక్షణ లేదు. డీఆర్డీసీ సమావేశంలో మహిళా అధికారిని పెద్దిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడారు. ప్రశ్నించినందుకు డాక్టర్ అనితారాణిని పిచ్చిదానిగా ముద్రేశారు. టీడీపీ ఇన్ చార్జ్ అనీషా రెడ్డిపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు హేయం. పెద్దిరెడ్డి కుటుంబం ఎలాంటిదో, అనీషా రెడ్డి కుటుంబం ఎలాంటిదో చిత్తూరు జిల్లా మొత్తం తెలుసు. అనీషా రెడ్డి విద్యావంతురాలు. ఉన్నత కుటుంబం ఆమెది. ప్రతి గల్లీలో చెబుతారు పెద్దిరెడ్డి కుటుంబ చరిత్ర గురించి'' అని మండిపడ్డారు.

''బడుగు, బలహీన వర్గాలంటే పెద్దిరెడ్డికి లెక్కలేదు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై అగ్రకుల ఆధిపత్యం ప్రదర్శించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ తన దొడ్డిలో ఎద్దు లాంటి వాడంటూ మాట్లాడ్డమేంటి? డాక్టర్ సుధాకర్ పిచ్చివాడని హేళన చేశారు. ఓం ప్రకాష్ అనే దళిత వ్యక్తి మృతిపై ఇంతవరకూ విచారణ చేపట్టలేదు. పెద్దిరెడ్డికి అభివృద్ధి చేయడం చేతకాదు కానీ, టీడీపీ నేతలను ఆడిపోసుకోవడం తెలుసు. పెద్దిరెడ్డికి దమ్మూ, ధైర్యం ఉంటే పంచాయతీశాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి. బయటకు వచ్చి శ్వేత పత్రం విడుదల చేయాలి'' అని డిమాండ్ చేశారు.

''నామినేషన్ వేయాలంటేనే చిత్తూరు జిల్లా మహిళలు భయపడుతున్న పరిస్థితిని పెద్దిరెడ్డి తీసుకొచ్చాడు. సిగ్గుగా అనిపించడం లేదా? పెద్దిరెడ్డి ఇంట్లో ఆడవాళ్లు లేరా? పెద్దిరెడ్డి తన పేరును పెద్దిరెడ్డి రావణాసుర రెడ్డిగా మార్చుకోవాలి. పెద్దిరెడ్డి కుటుంబం కౌరవవనం, రాక్షసమూకలా తయారయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే తెలుగుదేశం పేరు ఎత్తితే పెద్దిరెడ్డి భయపడుతున్నారు. ఇలాంటి మినిస్టర్ అవసరమా రాష్ట్రానికి'' అని అన్నారు. 

''ఒక్క జగన్మోహన్ రెడ్డితో తప్పించి ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడ్డం పెద్దిరెడ్డికి వచ్చా? సంస్కారంగా మాట్లాడటం పెద్దిరెడ్డికి రాదు. ఎక్కడబడితే అక్కడ కాంట్రాక్టులు చేసుకుంటూ పెద్దిరెడ్డి ఒక్కరే సంతోషంగా ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ సంతోషంగా లేరు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం, హద్దు మీరి మాట్లాడటం వంటి చర్యలను పెద్దిరెడ్డి మానుకోవాలి'' అని అనురాధ సూచించారు.

click me!