జమిలి ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకం: తోట నరసింహం

First Published Jul 8, 2018, 4:42 PM IST
Highlights

జమిలి ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకమని ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు లా కమిషన్ చైర్మెన్ కు టీడీపీ ఆదివారం నాడు లేఖ రాసింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాసిన లేఖను టీడీపీ ఎంపీలు తోట నరసింహం నేతృత్వంలోని బృందం ఆదివారం నాడు అందించింది.

హైదరాబాద్‌: జమిలి  ఎన్నికలకు తాము వ్యతిరేకమని టీడీపీ ప్రకటించింది.ఈ మేరకు ఆదివారం నాడు లా కమిషన్ చైర్మెన్‌కు టీడీపీ ఎంపీలు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాసిన లేఖను సమర్పించారు.

అభివృద్ధికి ఆటంకమనే పేరుతో జమిలి ఎన్నికల అంశాన్ని బీజేపీ తెరమీదికి తెచ్చిందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కల్గించేలా జమిలి ఎన్నికలను ముందుకు తెస్తోందని టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు.

2019 ఏప్రిల్‌లో ఏపీ రాష్ట్రంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని, దానికి తాము సిద్దమేనని చెప్పారు. అంతేకాదు లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగినా కానీ, తాము  సిద్దంగానే ఉన్నామని వారు స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాల కాల పరిమితి ముగిస్తే దాన్ని పొడిగించడం కానీ, లేదా కాలపరిమితిని తగ్గించేందుకు అనుగుణంగా  మార్చుకొనేందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందన్నారు. గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రభుత్వ కాలపరిమితిని ఏడాది పాటు పొడిగించిన విషయాన్ని టీడీపీ ఎంపీలు  తోట నరసింహం, కనకమేడల రవీంద్రకుమార్ లు  గుర్తు చేశారు.

ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను తమ చెప్పు చేతల్లో  పెట్టుకొనేందుకు కేంద్రం జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.ఇంకా ఆలస్యంగా ఎన్నికలు జరిగితే ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నందున  ముందస్తుకు బీజేపీ సిద్దమౌతోందని టీడీపీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఆదివారం నాడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు తోల నరసింహం నేతృత్వంలో ఎంపీలు లా కమిషన్ చైర్మెన్ ను కలిసి ఈ మేరకు తమ పార్టీ అభిప్రాయాన్ని తెలిపారు.


 

click me!