
తెలుగు చిత్ర పరిశ్రమలోని (tollywood) సమస్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో (ys jagan) చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం ఇటీవల తాడేపల్లికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ వద్ద చిరంజీవి తగ్గి మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు నరేశ్ (naresh).. చిరుపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు.
జగన్ కు చిరంజీవి దండం పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆయన సెటైర్లు విసిరారు. తప్పు లేనప్పుడు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆత్మాభిమానాన్ని చంపుకుని జగన్ దగ్గరకు ఎందుకు పోవాల్సి వచ్చిందంటూ తాను సోషల్ మీడియాలో చూశానని రామ్మోహన్ అన్నారు, ఇండస్ట్రీకి పెద్దగా ఉండే వ్యక్తి జగన్ దగ్గరకు పోయి ఎందుకు దండం పెట్టుకోవాల్సి వచ్చిందని చాలా మంది అంటున్నారని ఆయన గుర్తు చేశారు.
‘తానే పెద్ద నటుడిని అనుకుంటే.. నా కంటే పెద్ద నటుడివి నువ్వు’ అని అర్థం వచ్చేలా మాత్రమే జగన్ కు చిరంజీవి దండం పెట్టారంటూ రామ్మోహన్ నాయుడు వ్యంగ్యస్త్రాలు సంధించారు. అంతే తప్ప ఆ దండంలో వేరే ఉద్దేశమేమీ లేదని చెప్పారు. విశాఖకు సినీ పరిశ్రమ రావాలంటూ జగన్ ఇప్పుడు చెబుతున్నారని.. కానీ, చంద్రబాబు నాయుడే (chandrababu naidu) దాని కోసం ప్రయత్నించారని, భూములు కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని రామ్మోహన్ నాయుడు గుర్తుచేశారు.
ఇదే సమయంలో ఇప్పటికే విశాఖలో ఏర్పాటు చేసిన రామానాయుడు స్టూడియోకు (rama naidu studio) కేటాయించిన భూమిని లాక్కోవడానికి సీఎం జగన్ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. జగన్ చేష్టలు చూస్తుంటే నవ్వొస్తుందని.. రాష్ట్రంలో ఆ 151 మంది తప్ప జగన్ ను పొగిడే వ్యక్తి ఎవరూ లేరంటూ టీడీపీ ఎంపీ దుయ్యబట్టారు. ఆయన వ్యక్తిత్వం వెనక పులకేశి లాంటి రాజు కూడా దాగున్నాడని సెటైర్లు వేశారు. ఆయనే లేని సమస్యను సృష్టించి, ఇండస్ట్రీ వాళ్లను పిలిపించుకుని, ఆ సమస్యకు పరిష్కారం చూపించినట్టు సినీ ప్రముఖులకు గీతోపదేశం చేసి వారితో పొగిడించుకునే పరిస్థితికి వచ్చారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఇంత దిగజారుడు చర్యలకు బహుశా ఎవరూ పాల్పడరేమోనంటూ దుయ్యబట్టారు.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(YS Jagan) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విరుచుకుపడ్డారు. సీఎం జగన్.. లేని సమస్యను సృష్టించి సినీ హీరోలను ఘోరంగా అవమానించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్‌ని ప్రాధేయపడాలా అని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన సినీ పరిశ్రమను జగన్ కించపరిచారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైసీపీ యుద్దం ఎక్కడని ప్రశ్నించారు. యుద్దం చేయకుండా పలాయనవాదమెందుకు వైఎస్ జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు.