
అమరావతి: ఏపీ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ) లో ఖాళీలను భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీగా ఉన్న 2,588 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఈ మేరకు వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
సర్జన్, అసిస్టెంట్ సర్జన్లు పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఇలా మొత్తం 446 మందిని తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా పలువురు సిబ్బందిని ఒప్పంద, పొరుగు సేవల ప్రాతపదికన తీసుకోనున్నట్లు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రిక్రూట్‌మెంట్ పూర్తిచేయాలని ఇటీవల వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ప్రతిసారీ సీఎం జగన్ అధికారులను ఆదేశిస్తున్న విషయం తెలిసిందే. పీహెచ్‌సీలు మొదలుకుని సీహెచ్‌సీలు, బోధనాసుపత్రుల వరకు అన్నిట్లోనూ ఖాళీలు లేకుండా రిక్రూట్ మెంట్ పూర్తిచేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఈ నియామకాల తర్వాత ఎక్కడ కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదని... ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని సీఎం సూచించారు. సీఎం ఆదేశాలతో వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతమయ్యింది.
ఇదిలావుంటే రెవెన్యూ, దేవాదాయ శాఖలో కూడా ఉద్యోగాల భర్తీకి గతేడాది చివర్లో ఏపిపిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, దేవాదాయ శాఖలో 60 ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఏపీపీఎస్సీ. 2021 డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 19వ తేదీ వరకు అభ్యర్ధుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. త్వరలోనే అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించేందుకు ఏపిపిఎస్సి కసరత్తు చేస్తోంది.
ఇక కోవిడ్ కారణంగా మరణించిన ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల కుటుంబాల్లో అన్ని అర్హతలు కలిగినవారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఇటీవల అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన కరోనా బాధిత కుటుంబాల వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలివ్వాలని సీఎం సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను కారుణ్య నియామకాల కోసం వినియోగించుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి... కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా యుద్ద ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలివ్వాలని సీఎం సూచించారు. ఈ ఏడాది జూన్ 30లోగా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. అన్ని విభాగాలూ దీనిపై దృష్టిపెట్టాలి జగన్ కోరారు.
ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీ పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని కారుణ్య నియామకాలు చేయాలని... ఇందులో ఆలస్యానికి తావు ఉండకూడదని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు.