ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి.. వెలువడిన ఉత్తర్వులు..

By Sumanth KanukulaFirst Published Feb 15, 2022, 2:08 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై (Gautam Sawang) బదిలీవేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులను జారీచేసింది. 

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై (Gautam Sawang) బదిలీవేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ సీఎం  జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులను జారీచేసింది. ఏపీ కొత్త డీజీపీగా  కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి అదనపు బాద్యతలను అప్పగించింది. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. అయితే గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయనకు ఎక్కడ పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీఏడీ‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, 2023 జూలై వరకు సవాంగ్‌కు సర్వీస్ ఉన్నప్పటికీ ప్రభుత్వం బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

 ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. గౌతమ్ సవాంగ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. గత రెండున్నరేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి గౌతమ్ సవాంగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. సీఎం జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. సీఎం జగన్ ఆదేశాలను గౌతమ్ సవాంగ్ తప్పుకుండా అమలు చేస్తారనే టాక్ కూడా ఉంది. అయితే ఇటీవల ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం.. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ క్రమంలోనే సీఎం జగన్.. గౌతమ్ సవాంగ్‌ను తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. అయితే భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో, ఉద్యోగులు అంత పెద్ద ఎత్తున విజయవాడకు తరలివస్తుంటే అడ్డుకోవడంలో డీజీపీ విఫలమయ్యారనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బదిలీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. 

click me!