తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన రాజకీయ భవిష్యత్ పై కీలక ప్రకటన చేసారు. ఎన్నికల వేళ తాను రాజకీయాల బ్రేక్ ఇస్తున్నట్లు సంచలన ప్రకటన చేసారు.
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రతిపక్ష టిడిపి భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బలమైన అభ్యర్థులను గుర్తించే పనిలోపడ్డ ఆ పార్టీకి సిట్టింగ్ ఎంపీలు షాక్ ల మీద షాక్ ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే టిడిపిని వీడి వైసిపిలో చేరగా తాజాగా మరో ఎంపీ కూడా ఈ ఎన్నికలకు దూరంగా వుంటున్నట్లు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో రాజకీయంగా మంచి పలుకుబడి కలిగిన గల్లా కుటుంబం ఈసారి పోటీకి దూరంగా వుండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 2024 ఎన్నికల్లో పోటీ చేయడంలేదని సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు.
శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా వుంటానని చెప్పడంలేదు... కానీ కొంతకాలం కేవలం బిజినెస్ పైనే దృష్టిపెట్టాలని భావిస్తున్నట్లు గల్ల జయదేవ్ తెలిపారు. బిజెనెస్ పనుల్లో బిజీబిజీగా వుంటూ ప్రజలకు పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించలేకపోతున్నా... అందువల్లే ఈసారి ఎంపీగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని జయదేవ్ తెలిపారు. అంతేకాదు తాను బిజినెస్ చేస్తూనే ఎంపీగా వుండటం వివాదాస్పదం అవుతోంది... ఇది కూడా పోటీకి దూరంగా వుండటానికి ఓ కారణమని అన్నారు. ఇకపై తన పూర్తిసమయం బిజినెస్ కే కేటాయించాలని అనుకుంటున్నాను... అందుకోసమే రాజకీయాలకు దూరం అవుతున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించారు.
2024 ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని తెలుసు... గెలుస్తాననే పూర్తి నమ్మకం ఉందని గల్లా జయదేవ్ అన్నారు. కానీ వ్యాపార కార్యకలాపాలు చూసుకునేందుకే ఫోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తర్వాత మళ్ళీ అవకాశం వస్తే తప్పకుండా గుంటూరు లోక్ సభ నుండే పోటీ చేస్తానని గల్లా జయదేవ్ తెలిపారు.
Also Read ఓడిపోతానని జగన్‌కి అర్ధమైపోయింది.. ఆ మాటల్లో తేడా అందుకే : చంద్రబాబు నాయుడు
రెండుసార్లు ఎంపీగా పని చేసానని ... ఈ పదేళ్ల తన పనితీరు ఎంతో సంతృప్తికరంగా వుందని గల్లా జయదేవ్ అన్నారు. చాలామంది ఎంపీలకు వారు చెయాల్సిన పనులేంటో కూడా తెలియవు... కానీ తాను ఎంపీగా చేయాల్సిన అన్ని పనులూ చేశానన్నారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి అండగా వుండాలంటే ఎంపిగా పోటీ చేయడమే సరైనదని భావించానని... అందుకోసమే ఏరికోరి టిడిపి నుండి గుంటూరు లోక్ సభకు పోటీచేసానని అన్నారు. గుంటూరులో పని చేయడం చాలా ఆనందంగా ఉందని గల్లా జయదేవ్ అన్నారు.
ఎంపీగా పోటీచేసిన రెండుసార్లు డిల్లీతో పోరాటం చేస్తానని చెప్పాను... దీంతో ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించాలని జయదేవ్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేసానని... కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసానని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధానిగా అమరావతి కొనసాగింపుపై కేంద్రంతో పోరాటం చేసానని అన్నారు. తన పనితీరు బాగుంది కాబట్టే గుంటూరు ప్రజలు రెండోసారి కూడా గెలిపించారని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.
తన కుటుంబానికి రాజకీయంగా మంచి పేరుంది... దాన్ని చెడగొట్టకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేసానని గల్లా జయదేవ్ అన్నారు. తన తల్లి గల్లా అరుణ కుమారి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని... ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేసారని అన్నారు. అప్పటినుండే సొంత వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయాలు చేసేవారిమని... ఇప్పుడలా కుదరడం లేదన్నారు. అందువల్లే కొంతకాలం రాజకీయాలకు దూరంగా వుంటూ వ్యాపారాలు చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.